Nov 13,2023 23:54

విలేకర్లతో మాట్లాడుతున్న పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం భవనం కింది గదుల్లో అద్దెకుంటున్న పయనీర్‌ ఆటోమొబైల్‌ షాపు వారు కాలపరిమితి దాటిన దృష్ట్యా వెంటనే ఖాళీ చేయకుంటే భవన ఎదుట బుధవారం ధర్నా చేస్తామని అసోసియేషన్‌ సభ్యులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం అసోసియేషన్‌ కార్యాలయంలో విలేకర్లతో అసోసియేషన్‌ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు బొట్టు రామారావు, ప్రతాపరెడ్డి మాట్లాడారు. భవనంలోని కింద గదులను పయనీర్‌ ఆటోమొబైల్‌ షాపునకు 2006 నుండి 12 ఏళ్లపాటు నామమాత్రపు అద్దె రూ.500 లీజు జగ్రిమెంటుతో జవ్వాది సీతారామయ్యకు ఇచ్చామని, ఆయన మరణానంతరం 2017 నుండి మూడేళ్లపాటు (2019 వరకు) అతని సోదరుడైన సాంబశివరావు (గాంధీ)కు అదే అద్దెను ఖరారు చేసి లీజు అగ్రిమెంటు ఇచ్చామని తెలిపారు. లీజుకాలం పూర్తయిన తర్వాత షాపును ఖాళీ చేయాలని తాము పలుమార్లు కోరినా వారు కాలయాపన చేస్తున్నారని అన్నారు. తాము పై అంతస్తులోకి రావడానికి ఇబ్బందులు పడుతున్నామని, కింది గదులను ఖాళీ చేస్తే కార్యాలయాన్ని అక్కడికి మార్చుకోవాల్సి ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని లీజుదారులతోపాటు మంత్రి రాంబాబు దృష్టికి తీసుకువెళ్లినా, ఆయన వారిని పిలిపించి మాట్లాడినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఆ షాపు యజమాని ఆ గదులను ఖాళీ చేయకపోగా అతన్ని బెదిరిస్తున్నట్లు లీగల్‌ నోటీసులు ఇప్పించారని, కేసు పెడతానంటూ భయ పెడుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో సభ్యులందరం 15న నిరవధిక ధర్నాకు దిగుతు న్నామని, తమకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.పురుషోత్తం, ట్రెజరర్‌ మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు చంద్రయ్య, సభ్యులు పాల్గొన్నారు.