Nov 15,2022 23:56

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి - రంపచోడవరం
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న వివిధ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న భవనాలపై సంబంధిత ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏడు మండలాలలో నాబార్డ్‌, సిసిడిపి నిధులతో నిర్మిస్తున్న భవనాల ప్రగతిని సమీక్షించారు. నాబార్డ్‌, సిసిడిపి నిధులు ఎంత వచ్చింది ఎంత ఖర్చయింది, ఇంకా ఎంత నిధులు అవసరమో తదితర వివరాలపై మండలాల వారీగా ఆరా తీశారు. కల్వర్టులు, గొడౌన్లు. తదితర భవనాలకు ఇసుక, సిమెంటు, మెటల్‌ ఎక్కడ నుండి కొనుగోలు చేస్తున్నారో, వాటి ఖరీదు ఎంత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుడిసె పర్యటక ప్రాంతంలో నిర్మిస్తున్న భవనాలు, బొదులూరు గ్రామంలో నిర్మిస్తున్న గొడౌన్‌ రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లో నిర్మిస్తున్న కల్వర్టులు ఈ దశలో ఉన్నాయో ఆరా తీశారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న భవనాలన్నింటికీ కరెంటుతో సహా మౌలిక సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో హాట్‌ బజార్లు ఏర్పాటుకు ఎక్కడెక్కడ ఎంపిక చేశారో అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.డేవిడ్‌ రాజ్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లు సత్యనారాయణ, నాగరాజు, మహేశ్వరరావు, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.