ప్రజాశక్తి-ఆదోనిరూరల్
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రాహ్మణ భవనాల ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదన శర్మ కోరారు. గురువారం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పేరి కామేశ్వరరావుకు, రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడలోని దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీకాంత్ కార్యాలయంలో ఇద్దరు నాయకులతో సమావేశమైనట్లు చెప్పారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రాహ్మణులు శుభకార్యాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానాకి సొంత భవనాల్లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే చిన్న, చిన్న పట్టణాల్లో బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకోవడానికి సరైన వసతులు లేకపోవడంతో వేరే క్షేత్రాలకు వెళ్లి చేసుకుంటున్నారని తెలిపారు. ఆదోనిలో దాదాపు 2వేల బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయని, అపరకర్మలు చేసుకోవడానికి చిన్నపాటి స్థలం, నీటి వసతి లేదని చెప్పారు. వారు సానుకూలంగా స్పందించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి బ్రాహ్మణులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర బ్రాహ్మణ మహిళా విభాగం అధ్యక్షులు నిట్టల శైలజ, రాష్ట్ర బ్రాహ్మణ యువజన విభాగం అధ్యక్షులు సీతారామ్, సత్యనారాయణ శర్మ పాల్గొన్నారు.