ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్వహించిన ప్రత్యేక స్పందనలో మండల వైస్ ఎంపీపీ పాటు పోయి సత్యనారాయణ ఏకలవ్య భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై ఐటీడీఏ పీవో ఆకస్మికంగా గురువారం పర్యటించారు. మండలంలోని లబ్బూరులో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూలు నిర్మాణ పనులను ఐటిడిఏ పిఓ అభిషేక్ పరిశీలించారు. పనులను త్వరగా చేపట్టాలని గుత్తేదారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, డిసెంబరు నెలాఖరు నాటికి ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూలు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. గడువులోగా పనులన్ని పూర్తి చేసి భవనం అప్పగించాలని చెప్పారు. అనంతరం రావిడిపుట్టు గ్రామస్తులు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం బంగారుమెట్ట గ్రామ సచివాలయం భవనం నిర్మాణపు పనులు పరిశీలించారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలనీ, వెంటనే బిల్లులు వెంటనే చెల్లించడం జరుగుతుందన్నారు. కిలగాడ పంచాయతీ రాయపల్లి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్వాడీ భవన పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ కె. వేణుగోపాల్, ఎఇఇ జబ్బర్ పాల్గొన్నారు.










