Jul 24,2023 21:50

మ్యాప్‌ను పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే

ప్రజాశక్తి - పాచిపెంట/సాలూరు : పాఠశాల భవనాలు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఆదేశించారు. సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్య కార్యదర్శి పాచిపెంట మండలం గురువునాయుడుపేటలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవనాలు, పాచిపెంటలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు కల్పిస్తున్న అదనపు వసతులను, సాలూరు మండలం మామిడిపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల భవనాలు, మక్కువ మండలం అనసభద్రలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవనాలు పరిశీలించారు. నిర్మాణాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆగష్టులో ఒకటి, అక్టోబరులో ఒకటి, మిగిలినవి మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. మామిడిపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణం దీర్ఘకాలంగా కొనసాగడం పట్ల వివరణ అడిగారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్‌, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌, కార్యనిర్వాహక ఇంజినీర్‌ జె. శాంతీశ్వర రావు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
మక్కువ : మండలంలోని అనసభద్రలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవనాలను కాంతిలాల్‌ దండే పరిశీలించారు. నిర్మాణాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.
కురుపాం : స్థానికంగా రూ.12కోట్లుతో జరుగుతున్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మణాలు ను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతీలాల్‌ దండే పరిశీలించారు. ఈసందర్భంగా భవన నమూనా ,మౌలిక వసతులు ఏర్పాటు ,అదనపు సౌకర్యాలు కల్పించాలని గిరిజన సంక్షేమ ఈఎన్‌ సి ఎస్‌. శ్రీనివాస్‌ కు సూచించారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నాబార్డు నిధులు కోటీ తొంబై లక్షలతో అర్దాంతరంగా నిలిచిపోయిన అదనపు తరగతి గదులు పరిశీలించి అందుకు గలకారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇఎన్‌సి సమాధానం ఇస్తూ ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేసిన పనులకు సకాలంలో బిల్లు పెట్టడంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల నిధులు విడుదల కాలేదన్నారు. అనంతరం రూ.5కోట్లు నిధులతో ప్రారంభమై పునాది స్థాయిలో ఆగిపోయిన డైనింగ్‌ బ్లాక్‌ పనులు పరిశీలించారు. బాలికల గురుకులంలో సమస్యలు ప్రిన్సిపల్‌ సత్యవతిని అడిగి తెలుసుకున్నారు. డైనింగ్‌ బ్లాక్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని పిఒ విష్ణుచరణ్‌ కు సూచించారు. ప్రస్తుతం వినియోగం లో ఉన్న డైనింగ్‌ హాల్‌ పరిశీలించి డైనింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అదికారులు కు ఆదేశించారు.
దండే సారు ఇలా వచ్చొరు.. అలా వెళ్లారు..
సాలూరు: గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే సుడిగాలి పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం మండలం లోని మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులు పరిశీలించారు. సాయంత్రం నాలుగు గంటల కు వచ్చిన ఆయన కారు దిగకుండానే దూరం నుంచి అసంపూర్తిగా వదిలేసిన భవన నిర్మాణాన్ని చూశారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ చూపించిన మ్యాప్‌ పరిశీలించి వెనుదిరిగారు. ఏళ్లతరబడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల నూతన భవన నిర్మాణం నిలిచిపోయింది. వర్షాకాలంలో ప్రస్తుతం నడుస్తున్న పాఠశాల లో విద్యార్ధినులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.