Aug 23,2023 22:38

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* పంచాయతీరాజ్‌ ఇంజినీర్లపై కలెక్టర్‌ ఆగ్రహం
* ఐదుగురు ఎఇల సస్పెన్షన్‌కు ఆదేశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
జిల్లాలో చేపడుతున్న గ్రామ సచివాలయ భవన నిర్మాణాలపై పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు తప్పుడు నివేదికలు సమర్పించడంపై కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన కవిటి, మందస, మెళియాపుట్టి, పోలాకి, వజ్రపుకొత్తూరు మండలాల పంచాయతీరాజ్‌ సహాయక ఇంజినీర్లను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో చేపడుతున్న ప్రాధాన్యతా భవన నిర్మాణాలపై ఆ శాఖ ఇంజినీర్లతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం సమీక్షించారు. నిర్మాణాలు పూర్తయిన గ్రామ, వార్డు సచివాలయ భవనాలను ఎందుకు అందజేయలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిపై సమీక్షించిన ఆయన కవిటి, మందస, మెళియాపుట్టి, పోలాకి, వజ్రపుకొత్తూరు మండలాల్లో గ్రామ సచివాలయ భవన నిర్మాణాలపై ఇచ్చిన నివేదికలకు, క్షేత్రస్థాయిలో పనులకు పొంతన లేదన్నారు. తప్పుదోవ పట్టించే రీతిలో ఈ నివేదికలు ఉన్నాయని, సంబంధిత ఎఇలను సస్పెండ్‌ చేసేందుకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు నివేదించాలని ఆదేశించారు. సచివాలయ భవనాలతో పాటు ప్రాధాన్యతా భవనాలైన రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు చేపట్టిన భవన నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించడం పూర్తయిందని, ఎక్కడైనా బిల్లులు పెండింగ్‌లో ఉంటే తక్షణమే అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. చేపట్టబోయే పనులకూ నిధుల కొరత లేదని, సంబంధిత ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాని ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన టెక్కలి ఎఇకి షోకాజ్‌ నోటీసు, నిర్మాణాల్లో పురోగతి కనబరచని సోంపేట ఎఇకి ఛార్జిమెమో ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ వి.ఎస్‌.ఎస్‌.ఎన్‌ మూర్తి, కార్యనిర్వాహక ఇంజినీర్లు సురేష్‌, కుమార్‌, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.