Jul 03,2023 21:54

ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న దళితనాయకులు

భవన నిర్మాణాలకు చేయూతనివ్వండి
ప్రజాశక్తి-కావలి : కావలి డివిజన్లో దళితులు, గిరిజనులు వివాహం చేసుకోవడానికి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్‌ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడున్న కళ్యాణ మండపాల్లో లక్షల రూపాయలు బాడుగ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, కావున కావలి డివిజన్లో కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణానికి చేయూతనివ్వాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి డివిజన్లో ఒక్కటి కూడా అంబేద్కర్‌ భవనం గానీ కమ్యూనిటీ హాల్‌ గానీ లేకుండా చేశారన్నారు.
అన్ని డివిజన్లలో ఉన్నప్పటికీ కావలిలో ఉద్దేశ పూర్వకంగానే లేకుండా చేశారని తెలియజేశారు. బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురం దగ్గర సర్వే నెంబర్‌ 461/1 బిలో గ్రామకంఠం స్థలం ఉందని, ఆ స్థలంలో అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి పేదలకు అన్నదానం చేయడానికి అన్నదాన సత్రం నిర్మాణానికి స్థలం కేటాయిస్తే, తమ సొంత నిధులతో నిర్మించుకోగలమని ఆయన తెలియజేశారు. దళిత, గిరిజన విషయాలకు వచ్చే సరికి స్థానిక శాసనసభ్యులు గానీ, ఇతర ఏ నాయకుడు కూడా తమకు సహాయం చేయడం లేదని పేర్కొన్నారు. గతంలో కూడా ముసునూరు ప్రాంతంలో ఎకరా భూమి తీసిపెట్టినప్పటికీ గతంలో విశ్రాంత తహశీల్దార్‌ పట్టాల తోటి దొంగ పట్టాలు సృష్టించి, స్థానిక రెవెన్యూ అధికార్ల సహకారంతో అధికార పార్టీ నాయకులతో ఆ స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని తెలియజేశారు. గతంలో పనిచేసిన అధికారులు డూప్లికేట్‌ పట్టాలతో మందాటి చెరువు దగ్గరి నుంచి, మొత్తం బినామీలతో ఆక్రమించుకొని, వ్యాపారాలు చేస్తున్నారని తెలియజేశారు. అంబేద్కర్‌ భవనానికి తీసి పెట్టిన భూమికి దొంగ పట్టాలు సృష్టించి, ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్నారు. అధికార పార్టీ అండ ఉంటే ఏమైనా చేయవచ్చా అని ప్రశ్నించారు. కాబట్టి చెంచులక్ష్మిపురం స్థలంలో అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాన్ని కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జయరాజ్‌, యోహాను, మాల్యాద్రి, కాకి ప్రసాదరావు, మొగిలి కల్లయ్య, షేక్‌. రఫీ తదితరులు పాల్గొన్నారు.