Apr 28,2023 21:11

సమీక్షలో మాట్లాడుతున్న కమిషనర్‌

ప్రజాశక్తి-గుంటూరు : రోడ్ల మీద ఉన్న భవన నిర్మాణ వ్యర్ధాలను మూడ్రోజుల్లో తొలగించాలని, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రోడ్లపై మీద భవన నిర్మాణ వ్యర్ధాలను వేసిన వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. పట్టణ ప్రణాళిక అధికారులతో కమిషనర్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. భవన నిర్మాణ వ్యర్ధాలను నిర్మాణదారులు ఇష్టానుసారం రోడ్ల మీద వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి వారి నుండి అపరాధ రుసుం వసూలు చేసి, వ్యర్ధాలను తొలగించాలని సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శులను ఆదేశించారు. భవన నిర్మాణ సమయంలో తప్పనిసరిగా గ్రీన్‌ మ్యాట్‌తో దుమ్ము రాకుండా కవర్‌ చేసుకోవాలని యజమానులకు తెలియజేయాలన్నారు. ఇప్పటివరకు రీసర్వే 76 శాతం జరిగిందని, వచ్చే వారానికి 85 శాతం పూర్తి చేయాలన్నారు. మీడియా డివైజ్‌ ఫీజుల బకాయిలు, ప్రస్తుతం ఫీజులు వసూళ్లు, టిటిడిఆర్‌ బాండ్లు జారీ, కోర్టు కేసులపై సమీక్షించారు. సమావేశంలో సిటీ ప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, డిప్యూటీ సిటీప్లానర్లు మూర్తి, కోటయ్య, ఎసిపిలు బాబురావు, అజరుకుమార్‌, అశోక్‌కుమార్‌, సర్వేయర్లు సునీల్‌కుమార్‌, హరికృష్ణ, టిపిఎస్‌లు పాల్గొన్నారు.