Aug 20,2023 22:48

సమావేశంలో మాట్లాడుతున్న ఇఎస్‌ వెంకటేష్‌

ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఎన్జీవో హోంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె.రామక్రిష్ణ అధ్యక్షతన ఆదివారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వెంకటేష్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తల సాంబశివ, జిల్లా అధ్యక్షులు సురేంద్ర చౌదరి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అహమ్మద్‌ హుస్సేన్‌, బిఎస్‌పి నాయకులు బెనర్జీ, ఇర్పాన్‌, సిపిఎం నాయకులు జి. నరసింహులు, పట్టణ కార్పెంటర్‌ యూనియన్‌ నాయకులు హిదయాతుల్లా, పట్టణ బిల్డింగ్‌ సంఘం నాయకులు షామీర్‌, వలీ తనకల్లు నాయకులు శ్రీనివాస్‌, తలుపులు నాయకులు మహుబూబ్‌బాషా, గణేష్‌, బాబ్జన్‌, నల్లచెరువు కిష్టప్ప, సదాశివ, గాండ్లపెంట సోము, పూలకుంట వెంకటేష్‌, నల్లమాడ నరసింహులు,గంగరాజు, మున్సిపల్‌ నాయకులు జనార్దన్‌, నాయకులు బాబ్జన్‌, వ్యవసాయ కార్మిక సంఘం రమేష్‌ సీనియర్‌ నాయకులు జాపర్‌ వలీ ,స్థానిక సిఐటియు నాయకులు జగన్‌, ముస్తక్‌ ,పైరోజ్‌, పాజిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను ఆపేస్తూ జారీ చేసిన మెమో నెంబర్‌ 1214 ను రద్దుచేసి సంక్షేమ పథకాలను గతంలో ఉన్న వాటిని యథాతధంగా కొనసాగించాలన్నారు. జీవో నెంబర్‌ 17ని రద్దు చేసి నిబందనలకు విరుద్దంగా తరలించిన సంక్షేమబోర్డు నిధులను తిరిగి జమ చేయించాలని డిమాండ్‌ చేశారు. పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాయకత్వంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డును ప్రారంభించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, వేలాది మందికి బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా లబ్ధి చేకూరిందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా ఎటువంటి సంక్షేమ పధకాలు అమలు జరగవని కార్మికశాఖ కమిషనర్‌ మెమో నెం.1214 ను జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. చట్ట ప్రకారం అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్‌ పథకాన్ని అమలు చేయించాలని, 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులను కూడా వెల్ఫేర్‌ బోర్డులో సభ్యులుగా కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు అమలు జరిపించాలని డిమాండ్‌ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం వెల్ఫేర్‌ బోర్డు నిధులను చంద్రన్న బీమాకు వాడిన సందర్భంగా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అప్పటి ప్రభుత్వ చర్యలను తప్పుపట్టి భవన నిర్మాణ కార్మికుల ఆందోళనలో పాల్గొని మద్దతునిచ్చిందని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ బీమాకు ఏకంగా రూ.385 కోట్లు, మిగులు నిధులు అనే పేరుతో రూ. 450 కోట్లు బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు నుండి దారి మళ్లించిందని విమర్శించారు. ఈ సమస్యలపై ఈనెల 27న స్థానిక ఎమ్మెల్యే కి కలిసొచ్చే సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపు కొని సామూహికంగా వినతిపత్రం ఇవ్వాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.