Oct 04,2023 21:18

సమావేశంలో మాట్లాడుతున్న జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్తు సర్వ సభ్య సమావేశం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడింది. విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాలో కొత్తగా 27వేల ఇళ్లను మంజూరు చేసినట్టు సమావేశంలో చర్చకు వచ్చింది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టని పట్టాలను రద్దుచేసి, వాటిని అర్హులైన ఇతర పేదలకు కేటాయించాలని సమావేశంలో పలువురు సూచించారు. ముఖ్యంగా గురజాడ స్మారక భవనం నిర్మాణానికి జెడ్‌పి తరపున సహకారం అందించాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి చేసిన విజ్ఞప్తి మేరకు నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసేందుకు సర్వసభ్య సమావేశం తీర్మానించింది.
జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగిన జెడ్‌పి సర్వసభ్య సమావేశంలో పలు అంశాలు కీలక చర్చకు వచ్చాయి. తొలుత మహాకవి గురజాడ అప్పారావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలగట్ల విజ్ఞప్తి మేరకు గురజాడ స్మారక భవన నిర్వహణకు నెలకు రూ.10 వేలు చొప్పున కేటాయిస్తూ తీర్మానిస్తున్నట్లు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రకటించగానే హర్షద్వానాలు మిన్నంటాయి. సభ్యులంతా చప్పట్లతో తీర్మానాన్ని ఆమోదించారు. గురజాడ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపడతామని చైర్మన్‌ ప్రకటించారు. ఆయన రాసిన దేశమంటే మట్టికాదోరు... దేశమంటే మనుషులోరు అనే పంక్తులు ప్రపంచానికి ఆదర్శమన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలను జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌ వివరించారు. గరుగుబిల్లి, బలిజపేట మండలాలను పార్వతీపురం విద్యుత్తు సబ్‌డివిజన్‌లో చేర్చినట్లు తెలిపారు. విజయనగరం మండలంలో మరో పిహెచ్‌సి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. వాలంటీర్ల జీతాల సమస్యతోపాటు పలు ఇతర సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం గృహనిర్మాణం, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ పనులు, డిఆర్‌డిఎ, విద్య, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు.
ఉమ్మడి జిల్లాలో కొత్తగా సుమారు 27 వేల ఇళ్లను మంజూరు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జెడ్‌పి చైర్మన్‌ తెలిపారు. విజయనగరం జిల్లాలో 15,040 ఇళ్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 11,800 ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు గృహనిర్మాణంపై జరిగిన సుదీర్ఘ చర్చలో తెలిపారు. ఇవన్నీ వ్యక్తిగత ఇళ్లు మాత్రమేనని, ప్రస్తుతం కాలనీల్లో ఇళ్లు మంజూరు చేయడం లేదని వివరించారు. ఇప్పటికే మంజూరై, నిర్మాణాన్ని ప్రారంభించని ఇళ్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తవారికి మంజూరు చేయాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, డిప్యుటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, పలువురు జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు మాట్లాడారు. తమ ప్రాంతంలోని గృహనిర్మాణ పరిస్థితి, సమస్యలపై చర్చించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని కొత్త ఇళ్ల మంజూరుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని, రెండు జిల్లాలో హౌసింగ్‌ పీడీలను చైర్మన్‌ ఆదేశించారు.
వైద్య పరీక్షల అనంతరం పింఛను
ఆధార్‌ కార్డులో పొరపాటున వయసు తక్కువగా నమోదైన వారికి, వైద్య పరీక్షల అనంతరం అర్హులని తేలితే పింఛను మంజూరు చేసే అవకాశం ఉందని జెడ్‌పి చైర్మన్‌ తెలిపారు. దీనికోసం అటువంటి వారు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంటే, ఎంపిడిఒల ద్వారా దరఖాస్తులు వస్తాయని చెప్పారు. వారిని మెడికల్‌ బోర్డుకు పంపించి, వయసు నిర్ధారణ చేయనున్నట్లు వివరించారు. వారి వాస్తవ వయసు ఆధారంగా ఆధార్‌ కార్డును సవరించి, అన్ని అర్హతలు ఉంటే కొత్తగా పింఛను మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. అర్హత ఉండి, ఇప్పటికే పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నవారికి జనవరిలో కొత్త పింఛన్లు మంజూరవుతాయని చైర్మన్‌ చెప్పారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలి
ఉపాధి హామీ కింద చేపట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల పనులు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను జెడ్‌పి చైర్మన్‌ ఆదేశించారు. వీటిని సత్వరమే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అదనంగా నిధులను కేటాయించిందని, వాటిని సంబంధిత కాంట్రాక్టర్‌కు వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ పనుల్లో విత్‌హెల్డ్‌, క్వాలిటీచెక్‌ కోసం నిధులను పెండింగ్‌ పెట్టకూడదని స్పష్టం చేశారు. ఇవే కాకుండా ప్రాధాన్యేతర పనులు, జిజిఎంపి పనులను కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేల ద్వారా ప్రతి మండలానికి రూ.60 లక్షలు విడుదల చేసిందని, జెడ్‌పిటిసిల వద్ద జెడ్‌పి నిధులు రూ.15 లక్షలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాటిని సకాలంలో వినియోగించి, సిసి రోడ్లు తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
వంద శాతం ఇ-పంట నమోదు కావాలి : కలెక్టర్‌
జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా, వంద శాతం ఇ-క్రాప్‌ నమోదు చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై జరిగిన చర్చ సందర్భంగా, ఇ-పంట నమోదులో తలెత్తుతున్న పలు సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. భూములతో సంబంధం లేకుండా, సాగు చేసిన ప్రతి పంటా ఇ-క్రాప్‌లో నమోదు కావాలని జెడ్‌పి చైర్మన్‌ కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి, మన్యం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు తెలిపారు. జిపిఎస్‌ ఉన్న వాహనాలను మాత్రమే ధాన్యం రవాణాకు వినియోగిస్తామని, గోనె సంచులను మిల్లర్లే సమకూర్చుకోవాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు.
సమావేశంలో డిసిసిబి చైర్మన్‌ వి.వి.చినరామినాయుడు, డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి జిల్లాల జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.