- బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి - మైలవరం
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్‌టిఆర్ జిల్లా 9వ మహాసభ మైలవరంలోని మార్కెట్‌యార్డులో మంగళవారం జరిగింది. ముందుగా స్థానిక బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద ఆరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుండి పోలీస్‌స్టేషన్, ఆర్‌టిసి బస్టాండ్, రైతు బజార్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన బహిరంగ సభలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులున్నారని, కొందరు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఇసుక పాలసీతో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఐరన్, సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులకు పనుల్లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పనులు దొరక్క పస్తులుండాల్సి వస్తోందన్నారు. కొంత మంది పూట గడవక ఆత్మహత్యాలు చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్న సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాలను నిలిపివేసే చర్యలకు దిగుతోందన్నారు. సంక్షేమ బోర్డు నిధులను పక్కదారి పట్టించిందన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కార్మికులకు ఉపయోపడేలా చూడాలని, సంక్షేమ పథకాలను యధావిధిగా అమలుచేయాలని, పెండింగ్ క్లయిమ్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా స్కాలర్‌షిప్పులు, ఉత్పత్తిపరికరాలు, గృహ నిర్మాణాలకు రుణాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌యార్డులో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్‌టిఆర్ జిల్లా 9వ మహాసభ జరిగింది. మహాసభలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు. ఈకార్యక్రమంలో బిల్దింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.వెంకటేశ్వరరావు, ఎన్‌సిహెచ్.శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్.సుధాకర్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.










