ప్రజాశిక్త - సీతానగరం: భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.రాము డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ ఆవరణలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక ఇతర రంగాలకు వెళ్తున్నారన్నారు. జీవో 12 14 ను రద్దుచేసి సంక్షేమ బోర్డులను నిర్వీర్యం చేయకూడదన్నారు. సంఘం మండల అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ ఇసుక పాలసీతో పనుల్లేకుండా చేస్తుందన్నారు. మండల కార్యదర్శి తలాపు రమేష్ మాట్లాడుతూ గుర్తింపు కార్డులివ్వాలని, మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల పనుల్లేకపోవడంతో చినబోగిలికి చెందిన గుణుపూరు వాసు భవన నిర్మాణ కార్మికుడు పొలం పనులకు వెళ్లి పాముకాటుకు గురయ్యాడని, తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు ఎస్.శంకర్రావు, టి.వెంకటరమణ, గోపీకృష్ణతో పాటు వివిధ గ్రామాలకు చెందిన భవనిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.










