ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జగన్ ప్రభుత్వం ఇచ్చిన 1214 మెమోను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలని, నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన పథకాల పరిహారాలను కార్మికులకు తక్షణమే చెల్లించాలని ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వి.నరసింహారావు డిమాండ్ చేసారు. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం కాకినాడ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం సష్టించిన ఇసుక సంక్షోభం, అనంతరం వచ్చిన కరోనా సంక్షోభం వల్ల నిర్మాణ రంగం కుదేలై రాష్ట్రంలో 25 లక్షల నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఆర్థికంగా నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని కార్మికశాఖ ద్వారా వివరాలు సేకరించి నేటికి మూడేళ్లు పూర్తవుతున్నా ఒక్క రూపాయి కూడా జగన్ ప్రభుత్వం ఏ ఒక్క కార్మికునికీ చెల్లించలేదని విమర్శించారు. 2021 సెప్టెంబర్ నెల నుంచి స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజశేఖర్ రెడ్డి హయం నుంచి అమలవుతున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు పధకాలను నిలుపుదల చేసి కార్మికులను పెనం మీద నుంచి పొయ్యిలోకి పడేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ 1996 అసంఘటిత కార్మికుల సంక్షేమ చట్టం ద్వారా కార్మికులకు అందుతున్న చట్టబద్ధ పథకాలను నిలిపేసి, జగన్ ప్రభుత్వం నిర్మాణ కార్మికులు కష్టార్జితం అయిన సంక్షేమ బోర్డు నిధులు సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా రూ.2,450 కోట్లు తన అవసరాలకు దారి మళ్లించి కార్మికుల చేతిలో ఖాళీ కంచం పెట్టి రెండు విధాలుగా అన్యాయం చేసిందన్నారు. నాలుగేళ్లుగా అనేకసార్లు నాయకులకు, కార్మికశాఖ ఉన్నతాధికారులకు వినతులు అందించినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జగన్ ప్రభుత్వం కార్మికులకు చేసిన అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు ప్రతి కార్మికుడూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. జులై 1న జిల్లాలో ఉన్న స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కార్మికులందరితో వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని, జులై 18, 19 జరిగే నాయకత్వ శిక్షణా తరగతులకు అన్ని సంఘాల ప్రధాన నాయకత్వం హాజరవ్వాలని, ఆగస్టు 1న అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాల వద్దా ఘెరావ్ చేయాలని కార్యాచరణ ప్రకటించారు. ఈ ఈ సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కరణం విశ్వనాథం, జిల్లా ఉపాధ్యక్షుడు వాసంశెట్టి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు జీవా, వానపల్లి శివయ్య, లోవబాబు పాల్గొన్నారు.










