Jul 02,2023 16:32

సమావేశంలో మాట్లాడుతున్న శంకర్

భవన నిర్మాణ  కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి  
ప్రజాశక్తి - నంద్యాల

       భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం స్థానిక శ్రీనివాస సెంటర్  నందలి ఏపీటీఎఫ్ కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశానికి ఇర్ఫాన్ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా  హాజరైన ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు బిఓసిన్లో ని వేలాది కోట్ల రూపాయలను ఇతర రంగాలకు నిధులు దారి మళ్ళించిందని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను అమలు  చేయకుండా ప్రభుత్వం కార్మిక ద్రోహానికి పాల్పడిందని  విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను కార్మికుల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. బిఓసి లో దాదాపు 28 వేల క్లైములు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి నెలకు 5000 రూపాయల చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించాలని అలాగే ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యము కల్పించాలని, ప్రతి నిరుపేద భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో నిర్మాణరంగం కుదేలైందని ఆర్థిక భారాలతో పదుల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు మరణించారని ఆ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని తక్షణమే ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడి అకౌంట్లో పదివేల రూపాయలు జమ చేయాలని అన్నారు.గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు  కార్యదర్శి ఇర్ఫాన్ భాష, పిడిఎస్యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎస్ ఎం డి రఫీ, ఎస్ మహబూబ్ బాషా, మున్నా,సయ్యద్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.