
ప్రజాశక్తి-కొత్తవలస : భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా ప్రధానకార్యదర్శి కె.సురేష్ పిలుపునిచ్చారు. కొత్తవలసలో భవన నిర్మాణ కార్మికుల సంఘం రెండో మహాసభ జి.అప్పారావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ మహాసభలో తమ్మినేని, సురేష్‌తోపాటు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.రమణ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న క్లయిములను వెంటనే పరిష్కరించాలన్నారు. సంక్షేమ బోర్డు నిధులు ప్రభుత్వం పక్కదోవ పట్టించకుండా కార్మికుల కోసం ఖర్చు చేయాలని డిమాండ్‌చేశారు. సంక్షేమ బోర్డును పాత పద్ధతిలో పునరుద్ధరణ చేసి సమర్థవంతంగా నడపాలన్నారు. 60 ఏళ్లు దాటిన కార్మికులకు ప్రభుత్వం పింఛను ఇవ్వాలని కోరారు. అందరినీ ఆదుకున్నామని చెప్తున్న ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులు కనపడలేదా? అని ప్రశ్నించారు. సెస్ ద్వారా వసూలవుతున్న డబ్బులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రామునాయుడు, కార్యదర్శిగా నాగ రాజు, కోశాధికారిగా సత్యనారాయణ ఎన్నికయ్యారు.