Nov 02,2022 23:53

మాట్లాడుతున్న సుందర్‌ బాబు.

ప్రజాశక్తి- అరకులోయ :భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, భవన నిర్మాణ నిధుల్ని వాడుకోవడమే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆంధ్ర ప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సుందర్‌బాబు విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధమ మహాసభ అరకులోయలోని గిరిజన సంఘం భవనంలో బుధవారం ఆ సంఘం ప్రతినిధి కొర్రా రామచందర్‌ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.సుందర్‌ బాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి మూడు సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపి వేసిందన్నారు. ఇసుక, సిమెంటు, ఐరన్‌, బిల్డింగ్‌ మెటీరియల్‌ ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో సక్రమంగా పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర సంక్షేమ బోర్డులో నిధులు కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, పెండింగ్‌ లో ఉన్న క్లెయిమ్స్‌కు బడ్జెట్‌ విడుదల చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని విన్నవించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుతో స్థానిక అధికారులు ఆఫీసులు తెరవక పోవడంతో సేవలు అందని పరిస్థితి నెలకొందన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్‌ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు ఆర్దిక సహాయం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ, ఆధార్‌ కన్స్ట్రక్షన్‌ ఫెడరేషన్‌ నాయకులు కొండలరావు, జగన్‌, ప్రభుదాస్‌, కేశవరావు, సింహద్రి, రాము, కోటిబాబు, సింహాచలం, సోమినాయుడు, గోపి, రాజేంద్ర, దొరబాబు, సన్యాసి పాల్గొన్నారు.