Oct 18,2023 00:23

ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ప్రజాశక్తి -ములగాడ : భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖ బిల్డింగ్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన 59వ వార్డు పరిధి నెహ్రూనగర్‌ లేబర్‌ జంక్షన్‌లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మల్కాపురం జోన్‌ గౌరవాధ్యక్షులు కె.పెంటారావు మాట్లాడుతూ, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు సుమారు రూ.850 కోట్లను ఇతర పథకాలకు మళ్లించి భవననిర్మాణ కార్మికులకు అన్యాయం చేశారన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటినా భవన నిర్మాణ కార్మికుల ప్రసూతి, వివాహ, మృతిచెందిన వారికి క్లెయిములు మంజూరు చేయకుండా ఏగనామం పెట్టారని విమర్శించారు. సంక్షేమ బోర్డులో రూ.వేల కోట్లు ఉన్నా భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అందటం లేదన్నారు. కరోనా కాలంలో సంక్షేమ బోర్డు లేబరు కార్డు ఉన్న ప్రతి భవనిర్మాణ కార్మికునికీ రూ.10 వేలు చొప్పున సహాయం చేస్తానని చెప్పి విస్మరించారన్నారు. కార్డు ఉండి 60 సంవత్సరాలు దాటిన కార్మికుంలందరికీ ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి, వై.గంగాధర్‌, పైడినాయుడు, రాజు, సత్యం, రాజేష్‌, ఈశ్వరరావు, కుమార్‌, శ్రీను, సురేష్‌, సత్యం పాల్గొన్నారు.