ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్ : భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వారి సంక్షేమం కోసం పాటు పడాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక పుతుంభాక భవన్‌లో భవన నిర్మాణ కార్మిక, ఇతర అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎ.ప్రసాదరావు అధ్యక్ష వహించారు. విజరుకుమార్ మాట్లాడుతూ కార్మిక చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిస్తోందని, చట్ట ప్రకారం రావాల్సిన బకాయిలను నిలిపేసిందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నామయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైనా ఉందన్నారు. కార్మికుల పక్షాన పోరాటాలకు సిపిఎం ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. టిడిపి అధికార ప్రతినిధి పి.వెంకట కోటయ్య మాట్లాడుతూ వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలతో నిరంకుశంగా పాలిస్తోందన్నారు. కార్మికుల న్యాయమైన సమస్య పరిష్కారం కోసం పోరాటాల్లో కలిసి వస్తామన్నారు. జనసేన నాయకులు ఆర్.సుమన్ మాట్లాడుతూ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడకుండా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్ మాట్లాడుతూ భవన నిర్మాణం పైనే ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాడమాడుతోందని అన్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే కార్మికులకు సంక్షేమ శాఖకు సంబంధించి రూ.7 కోట్ల క్లెయిములు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 1న స్థానిక మంత్రి అంబటి రాంబాబు, 5న మంత్రి విడుదల రజినికి సామూహిక రాయభార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తమకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవాలని కోరారు. సమావేశంలో జనసేన నాయకులు కె.సాంబశివరావు, టిడిపి నాయకులు ఎ.నాగేశ్వరావు, డి.శ్రీనివాస్, ఐద్వా నాయకులు జి.ఉమశ్రీ పాల్గొన్నారు.










