Sep 28,2023 22:02

అంగన్వాడీకేంద్ర భవనం కూల్చివేత స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో, తదితరులు

ప్రజాశక్తిపుట్టపర్తి రూరల్‌ : మండల పరిధిలోని బత్తలపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి స్థలం ఇచ్చిన దాతలు అంగన్వాడీకేంద్రభవనాన్ని ఇటీవల కూల్చివేశారు. దీంతో ఆ స్థలాన్ని, ఆర్డీవో భాగ్యరేఖ ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మికుమారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అనుమతులు లేకుండా అంగన్వాడి భవనాన్ని కూల్చడం నేరమని దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో అంగన్వాదీ కేంద్రానికి స్థలం ఇచ్చిన దాతలు ఆస్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ భవనాన్ని లోకనాథ్‌ అనే వ్యక్తి కూల్చివేశారని అన్నారు. తమ ఫిర్యాదుతో భవనాన్ని కూల్చివేసిన వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వ స్థలానికి కంచే ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వానికి చెందినదని బోర్డు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు ఎవరైనా ఆక్రమించినా, ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసిన అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ గాయత్రి, పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ దాదాపీర్‌ తదితరులు పాల్గొన్నారు.