Jul 19,2023 00:03

ప్రజాశక్తి-కాకినాడ భవన నిర్మాణ కార్మికులందరూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధపడాలని పలువురు యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను కచేరిపేట టీచర్స్‌ హోమ్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షడు నారపల్లి రమణారావు మంగళవారం ప్రారంభించారు. మొదటిరోజు సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు వర్తమాన రాజకీయాలపై కార్మికులకు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ఉపాధికి జగన్‌ విధానాల ఫలితంగా తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. నిర్మాణ సామాగ్రి స్టీలు, సిమెంటు, ఇసుక, కలప, పెయింట్‌ ధరలు ఆకాశాన్ని అంటడంతో బడా బిల్డర్లు సైతం నిర్మాణాలు చేయడానికి భయపడుతున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గృహ యజమానుదారులు కట్టే సెస్‌ నిధులు కేంద్రం చెప్పిందని రాష్ట్రంలోని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తన అవసరాలకు మళ్ళించడం చట్ట వ్యతిరేకమే కాకుండా, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. అనేక పథకాలు అమలులో ఉన్న వాటిని 1214 మెమో ద్వారా స్వయానా ముఖ్యమంత్రి నిలుపుదల చేయడం అన్యాయం అన్నారు. నెలకు 15 రోజులు కూడా ఉపాధి దొరకని భవననిర్మాణ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం దూరం పెట్టిందని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం నుండి గాని, మరోవైపు సెస్‌ నిధుల ద్వారా అందే పథకాలు గాని కార్మికులకు చేరకపోవడంతో 35 లక్షల కుటుంబాలు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు తట్టుకోలేక రోడ్డున పడడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని దయబట్టారు. రాబోయే రోజుల్లో ఈ నాయకత్వ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వి.నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి నరసింహారావు, అల్లాడి గోపాలరావు, మందా సూరిబాబు, పి.అనసూయమ్మ, రాష్ట్ర కార్యదర్శులు ఎ.రాజు, సుందరబాబు, బాల వెంకట్‌, సాంబశివ, నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు పాల్గొన్నారు.