
పెరుగుతున్న జనాభా.. వనరులను మితిమీరి వినియోగించడం.. ఫలితం జీవవైవిధ్య పరిరక్షణ సంక్లిష్టంగా మారుతోంది. అడవుల దహనం.. భారీ ప్రాజెక్టుల నిర్మాణం.. ఇష్టారాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు.. యథేచ్ఛగా గనుల తవ్వకం.. నగరీకరణ.. అణు విద్యుత్ కేంద్రాలు.. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం.. వ్యవసాయంలో రసాయనాల వాడకం.. తదితరాలు జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమిపై ఉన్న కోట్లాది జీవరాశుల్లో మూడింట రెండొంతులు అంతరించే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతో పాటు పేదరిక నిర్మూలన.. సుస్థిర జీవనోపాధి.. అభివృద్ధిలో సమానత వంటి అంశాలతో జీవవైవిధ్యం ముడిపడి ఉంది. ప్రతి ఏడాది మే 22న 'అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం' జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 'అన్ని జీవులకు భాగస్వామ్య భవిష్యత్తును నిర్మించడం' అనేది ఈ ఏడాది ఇచ్చిన సందేశం. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..
మానవాళికి ప్రకృతి, జీవ వైవిధ్యం రెండు కళ్లు లాంటివి. జీవిత భవిష్యత్తును నిర్మించడానికి ఆశ, సంఘీభావం, అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యత కలిగి వుంది. భూమిపై ఒకే జాతి జీవుల మధ్య భేదాన్నే 'జీవ వైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మానవ జీవనశైలితో పర్యావరణం కలుషితమై, భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవ వైవిధ్యమూ దెబ్బతింటోంది. ఫలితంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. దాదాపు 20 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కలిగే నష్టాలు 150 శాతం మేర పెరిగాయి. వాతావరణ భూ భౌతిక వైపరీత్యాల వల్ల ఏకంగా 13 లక్షల మంది చనిపోయారు. పేద, మధ్యతరగతి దేశాల్లోనే మరణాలు మరింత ఎక్కువ. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆందోళనకర అంశాలు వెల్లడించింది. సముద్ర మట్టాలు, సాగరాల ఆమ్లత పెరుగుతుందనీ.. గత నాలుగేళ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. దాదాపు 10 లక్షల మొక్కలు, జీవజాతులు కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొచ్చిందని స్పష్టం చేసింది. ఈ భూమి ఏర్పడి, 350 కోట్ల సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా కోటి 40 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటిల్లో 80 లక్షలు మాత్రమే గుర్తించాం. అందులో మన దేశంలో కేవలం 17 లక్షల జీవరాశుల సమాచారం మాత్రమే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వన, జల, జీవ రాశులున్న దేశాల్లో భారత్ 12వ స్థానంలో ఉంది. మొత్తం మీద 12 శాతం అడవులు మనదేశంలోనే ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో జీవ వైవిధ్యంపై 60 శాతం మంది ఆధారపడి బతుకుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు తగ్గిపోయాయి.

మితిమీరిన అవసరాలు..
మనం ప్రకృతి వనరులను మితిమీరి వాడేస్తున్నాం. పంట రక్షణ పేరిట పంట పొలాలు, చెరుకు తోటలు, దుంప, కూరగాయలు, ఇతర వ్యవసాయ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకునే పేరిట గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే చర్యలకు ఎక్కువ జంతువులు బలవుతున్నాయి. ఫలితంగా అపార జీవజాతులు అంతరించిపోయాయి. ఈ పరిణామాలకు కారకుడు బుద్ధిజీవిగా పేరొందిన 'మనిషే' అన్న కఠోర నిజం ఆలోచింపజేయాల్సిన తరుణమిదే. 'ఈ భూప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలనూ తీర్చగలదు. కానీ దురాశను తీర్చడం మాత్రం సాధ్యం కాదు' అన్నారు మహాత్మాగాంధీ. అలాగే అత్యాశతో కొన్ని అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్తు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. అడవిపందులు, జింకలు, దుప్పిలను వేటాడి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. దీంతో పాటు క్వారీల పేలుళ్ల ప్రభావం వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. రిజర్వు అటవీ ప్రాంతంలో ఎటువంటి పేలుళ్లూ చేపట్టకూడదన్న అంశాన్ని పెడచెవిన పెడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న విలువైన కలప అక్రమ నరికివేతకు గురవుతున్నాయి. కలప దొంగలు మద్ది, టేకు, ఇరుగుడు, తెల్ల గుమ్మడి, మామిడి, నరమామిడి, నీలగిరి, వెదురు వంటి వాటిని నరికేసి, అక్రమ రవాణా సాగిస్తున్నారు. తమ అవసరాల కోసం మొక్కలను, జంతువులను ఇష్టారాజ్యంగా చంపేస్తున్నారు. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించి, వన్యప్రాణుల ఉనికికే ముప్పు కలిగిస్తున్నారు. ఫలితంగా వన్యప్రాణులు జనావాసాల మధ్యకు రావడం పరిపాటిగా మారింది.

అతరించిపోతున్న జాతులు..
అడవుల్లో వన్యప్రాణులను, సముద్రలోతుల్లో జలచరాలను వేటాడుతున్నారు. నివాస సముదాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట చిత్తడి నేలలు, మడ అడవులను కబళిస్తున్నారు. దీనివల్ల అరుదైన జీవ వైవిధ్య వనరుల ఉనికి ప్రమాదంలో పడిపోతోంది. ఇప్పటివరకూ భూభాగం మీద 14.36 లక్షల జాతులకు చెందిన జీవరాశులు శాస్త్రీయంగా ఉన్నట్టు గుర్తించారు. ఏటా 1.6 కోట్ల హెక్టార్లలో అడవులు కనుమరుగవుతున్నాయి. గుట్టలు క్వారీలుగా మారి, హరించుకుపోతున్నాయి. వాటితోపాటు అందులోని జీవ వైవిధ్యమూ అంతరించిపోతోంది. గడచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 వేల జాతులు కనుమరుగవుతున్నాయి. ఇదంతా పర్యావరణ పరిరక్షకుల ఆవేదన. జీవ వైవిధ్య పంటలూ 75 శాతం మేర అంతర్ధానమయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులూ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలో భారత భూభాగం 2.4 శాతం మాత్రమే ఉన్నా.. జీవ వైవిధ్యం వాటా 8.1 శాతం. దీన్ని కాపాడుకొనే విషయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుండటం బాధాకరం. నేడు అనేక జీవజాతులు అంతరించిపోవడానికి ప్రభుత్వ వైఫల్యాలే కారణం. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.

చట్టం ఏం చెబుతోంది..?
మన రాజ్యాంగం అధికరణం 48(ఏ) లో పర్యావరణ పరిరక్షణకు.. అభివృద్ధికి, ప్రభుత్వం కృషి చేయాలి. దేశంలోని వనాలను, వన్యప్రాణులను కాపాడడం రాజ్య విధి అని ఆదేశిక సూత్రాల్లో చెప్పింది. అంతేకాదు పర్యావరణ రక్షణ పౌరుల ప్రాథమిక విధి అని 51 ఏ(జి) లో స్పష్టంగా పేర్కొంది. అంటే పౌరులుగా మనం ఎక్కడైనా నీరు, నేలా, చెట్టు, గాలి నాశనమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ విషయాన్ని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, చివరికి కోర్టుకీ చెప్పాలి. అదే మన మొదటి బాధ్యత. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కులోనే మంచి గాలి, మంచినీరు, ఆరోగ్యవంతమైన పర్యావరణంలో బతికే హక్కు కూడా ఉంది. ఇది పౌరులుగా పర్యావరణం పట్ల మన బాధ్యత మీదా ఆధారపడి ఉంటుంది. ప్రఖ్యాత ఆవరణ శాస్త్రవేత్త ఇ.ఓ.విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు.. అంటే రోజుకు 27 జాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య, అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం అంతరించిన, అంతరించబోతున్న, ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని 'రెడ్ లిస్టు బుక్' / 'రెడ్ డేటా బుక్' లో ప్రచురిస్తోంది. ఇది సూచికగా ఉపయోగపడుతుంది. ఆర్కిడ్స్, గంధం చెట్టు సైకస్ సఫ్ఫా గ్రంధి, మొదలగు ఔషధ మొక్కలు.. చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండా, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేకపిట్ట, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్, గోల్డెన్ మంకి, లయన్ టేల్డ్ మకాక్, నీలగిరి లంగూర్, లారిస్, వంటి జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
నెరవేరని లక్ష్యాలు..
చైనాలో జరిగిన జీవవైవిధ్య 15వ సమావేశంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ మాట్లాడుతూ.. ప్రపంచం 2011 - 20 వరకూ అవసరమైన పురోగతులను సాధించలేదని, మానవ శ్రేయస్సుకి కీలకమైన పర్యావరణ వ్యవస్థల్ని కాపాడలేకపోయిందని పేర్కొన్నారు. 2011-20 కాలంలో ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ మెరుగుదల కోసం, అంతర్జాతీయ సమాజం 2010లో 20 కార్యాచరణ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ లక్ష్యాలు ఏవీ ఇప్పటివరకూ పూర్తిగా నెరవేరలేదని కన్వెన్షన్ సెక్రటేరియట్ ప్రతినిధి లియు అధికారికంగా వెల్లడించారు. ఈ ఏడాది జరుగనున్న ఈ సమావేశం రెండో భాగంపై అంతర్జాతీయ సమాజం గొప్ప ఆశలు పెట్టుకోవడంతో గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌పై సమీక్షించి, తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. 2030 నాటికి పర్యావరణ వ్యవస్థల్ని రక్షించాలని ఈ సమావేశం నిర్దేశిస్తుంది. 2030 కోసం ప్రతిపాదించిన ఫ్రేమ్‌వర్క్‌లో 21 లక్ష్యాలు పొందుపరచింది. ముఖ్యంగా 30 శాతం భూములు, మహాసముద్రాల రక్షణ కోసం '30/30' ప్రణాళికను రూపొందించింది. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిని నిలిపివేయడం, హానికరమైన పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం మరో ప్రధాన లక్ష్యంగా నిర్దేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో 11వ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.

ఆదివాసీలే అండ...
మన దేశంలో ఆదివాసీలు (గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవ వైవిధ్యం పదిలంగా ఉంది. దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసీలు నివసిస్తున్నారని ఒక అంచనా. వారిలో దాదాపు 53కు పైగా తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 80 శాతాని కంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జీవ వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటల్లో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసీలు నివాసాలున్న ప్రాంతాల్లోనే అధికం. అయితే ఆదివాసీలు బతుకుతున్న అడవులను మైనింగ్ పేరుతో ప్రభుత్వాలే కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయి. దీనిపై పోరాడుతున్న కార్యకర్తలపై బెయిల్ రాని భయంకరమైన 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తోంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, అసోం, హర్యానాలో వేలాదిమంది గిరిజనులను జైళ్లలో నిర్బంధించారు. జివో 3 సుప్రీం కోర్టు రద్దు చేయడంతో 5వ షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల రాజ్యాంగ హక్కు దెబ్బతింది. దీంతో 100 శాతం రిజర్వేషన్ హక్కు పోయింది. పట్టాలు పొందిన భూముల్లో ఎన్‌ఆర్‌ఇల ద్వారా, సిఎయంపిఎ నిధుల ద్వారా చెట్ల పెంపకం పేరుతో తిండి పంటలను దూరం చేస్తూ వారి భూములను ఆక్రమించుకుంటున్నారు. ఇలా ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పించి, అడవులను కాపాడాల్సిన ప్రభుత్వాలే వాటిని గనులు, ఇతర అంశాలకు కేటాయించి, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

జీవనశైలిని మార్చుకోవాలి..
రసాయన కాలుష్యాన్ని అరికట్టి, భూతాపాన్ని తగ్గించాలంటే మన జీవనశైలిని మార్చుకోవాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. రానున్న తరాలు ఇబ్బందుల పాలుకాకుండా ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడూ పూనుకోవాలి. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చెట్లను నరకాల్సి వచ్చినప్పుడు ఒక్క చెట్టు స్థానంలో పది చెట్లు నాటే విధంగా చర్యలు తీసుకోవాలి. జీవవైవిధ్య వనరుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలి. అప్పుడే మానవాళి భవితకు భరోసా.. భద్రత..

ఆచరణ అంతంతమాత్రం..
సహజసిద్ధ, సంప్రదాయ వనరులతో జీవ వైవిధ్యంలో మనదేశానికి ప్రత్యేకస్థానం ఉంది. అయితే, సంబంధిత చట్టాల అమలులో ప్రభుత్వాల ఉదాసీనత చేటుచేస్తోంది. అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికలో సభ్యదేశమైన భారత్ 2002లో జాతీయ జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి, చట్టాన్ని రూపొందించింది. కానీ, దాని అమలులో అడుగడుగునా అలసత్వం ప్రదర్శిస్తోంది. గ్రామాల్లో జీవ వైవిధ్య కమిటీలు ఏర్పాటు చేసి, పంచాయతీ పాలకవర్గం ద్వారా ఆయా ఆవాస ప్రాంతాల్లోని సాంప్రదాయ, జీవ వైవిధ్య వనరుల్ని సంరక్షించాలి. ప్రజలందరికీ జీవ వైవిధ్య అవగాహన కల్పించాలి. ఇదంతా ఏదో పేరుకే జరుగుతోంది. జీవ వైవిధ్య కమిటీల విషయంలో సుప్రీం కోర్టు కలగజేసుకుని, ప్రభుత్వాలను హెచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. 1986 పర్యావరణ పరిరక్షణ, 1980 అటవీ పరిరక్షణ, 1981 వాయు కాలుష్య నియంత్రణ, 1974 జల కాలుష్య నియంత్రణ, 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాల్లాంటివి ఎన్ని వచ్చినా.. దేశంలో కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. ఇటీవల ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యమే ఇందుకు ఉదాహరణ. ఫలితంగా అడవులు, వన్యప్రాణులు తరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచ సగటు కన్నా తక్కువగా మన దేశంలో 21 శాతం అడవులే ఉండటం కలవరపరుస్తోంది. తెలంగాణలో 24.05 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 22.86 శాతం మేర అరణ్యాలుండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం. అయినా పచ్చదనం ఇంకా పెరగాల్సి ఉంది. అంతర్జాతీయ ఒడంబడికకు తగినట్టు జీవ వైవిధ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు కృషి చేస్తేనే భావితరాలకు భద్రమైన భవిష్యత్తును అందించగలం !

ఆందోళన కలిగించే గణాంకాలు..
భూమిపై నివసించే జంతుజాలం సంఖ్య 1970 నుండి 40% తగ్గిపోయింది. గత 50 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 60% వన్యప్రాణులు నశించిపోయాయి.
- సముద్రాల్లో 40%, మంచినీటిలో 75% జీవజాతులు తరిగిపోయాయి.
- వచ్చే పదేళ్లలో దాదాపు 10 లక్షల జీవజాతులు అంతరించే ప్రమాదం ఏర్పడింది. అంటే ప్రతి నాలుగు జీవజాతుల్లో ఒకటి కనుమరుగయ్యే పరిస్థితి.
- ప్రపంచంలోని దాదాపు మూడోవంతు సముద్రాలు మానవ చర్యల కారణంగా అవాంఛనీయ మార్పులకు గురయ్యాయి.
- ప్రపంచ వ్యాప్తంగా కేవలం 15 శాతం చిత్తడినేలలు మాత్రమే నేటికి మిగిలాయి.
- పారిశ్రామికీకరణ యుగం కన్నా ముందుతో పోలిస్తే, నేటి ప్రపంచం మూడింట ఒకటో వంతు అటవీ సంపదను కోల్పోయింది. 2010-2015 మధ్యన స్వల్ప వ్యవధిలోనే మూడు కోట్ల హెక్టార్ల అటవీ సంపద అంతర్ధానమైంది.
- మొత్తంగా చూస్తే ప్రపంచంలోని 11,000 పక్షి జాతులలో 40% క్షీణించిపోతున్నాయి. ప్రతి ఎనిమిది పక్షి జాతుల్లో ఒకటి అంతరించిపోయే ప్రమాదంలో పడింది.
- గత 28 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా 75% కీటకరాశి తగ్గిపోయింది.
- ప్రపంచంలోని 504 వానర జాతుల్లో 60% అంతరించే ప్రమాదంలో పడ్డాయి. 75% వానర జాతుల సంఖ్య అత్యంత వేగంగా తరిగిపోతున్నాయి.
- పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2080 నాటికి ప్రపంచవ్యాప్తంగా 40% సరీసృపాల జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
- గత 150 ఏళ్లలో పగడపు దీవుల్లో 50 శాతం నిర్జీవంగా మారాయి. నాల్గో వంతు, తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. 75% పగడపు దీవులు స్థానిక, ప్రపంచ పర్యావరణ ప్రభావాలకు గురవుతున్నాయి.
- ప్రపంచ వ్యాప్తంగా 60% మంది ఔషధాల కోసం ప్రకృతిపై ఆధారపడి ఉన్నారు. జీవవైవిధ్యం నశిస్తే ఆ ప్రజల సాంప్రదాయ వైద్యం, ఔషధాలు దొరకని పరిస్థితి. ఆధునిక ఔషధ రంగంలో కొత్త ఔషధాలు, జీవ సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉండదు.

ఎలా కాపాడుకోవాలి?
- అడవులను నరకడం పూర్తిగా అరికట్టాలి.
- ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు వాడడం తగ్గించాలి. వీలైనంత వరకూ ప్లాస్టిక్‌ని నిరోధించాలి.
- వ్యవసాయంలో వాడే క్రిమిసంహారక మందులు, కీటక నాశునులు, కృత్రిమ ఎరువుల వాడకం తగ్గించాలి.
- నేల కాలుష్యానికి గల కారకాలను గుర్తించి అడ్డుకోవాలి. లేదంటే దీనివలన నీటి కాలుష్యమూ జరుగుతుంది.
- పరిశ్రమల ద్వారా వచ్చే ఘన, ద్రవ, వాయు పదార్థాలను నిరోధించాలి. అవసరమైతే శుద్ధి చేసి విడుదల చేయాలి.
- ఆహార వ్యర్థాలను తగ్గించాలి.
- ఘన, ద్రవ వ్యర్థాలును ఇష్టానుసారంగా పారవేయడం అడ్డుకోవాలి.
- జంతువులను వేటాడడం తగ్గించాలి.
- జీవవైవిధ్యం ప్రాముఖ్యత, అంతరించిపోతే కలిగే విపత్కర పరిస్థితుల గురించి వివరించాలి.
- జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
- సామాజిక అడవుల పెంపకాన్ని పర్యావరణ వేత్తలు ఉద్యమంలా చేపట్టాలి.
- ప్రభుత్వం పర్యావరణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేస్తూ జీవ వైవిధ్య అవశ్యకతను తెలియజేయాలి.
- జానపద కళలు, వీధి నాటకాల ద్వారా ప్రజల్లో జీవవైవిధ్యం పట్ల అవగాహన కలిగించాలి.
- సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వినూత్న శైలిలో జనాలకు సులభతరమైన భాషలో సరళంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలి.
అగ్రరాజ్యం చేయూతనిచ్చేనా?
అనేక విషయాల్లో ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికలో ఇప్పటికీ చేరకపోవడం గమనార్హం. మానవాళికి చేటుచేసే ఆయుధాల వ్యాపారంలో ముందుండే అగ్రరాజ్యం యూఎన్‌సీబీడీని మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు, భూగోళం మీద 33 శాతం అడవులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 31 శాతమే ఉన్నాయి. ఏటా భూమ్మీద 2.4 కోట్ల ఎకరాల్లో అడవులు కనుమరుగతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద అరణ్యాల్లో ఒకటైన అమెజాన్ అడవిలో ఇటీవల రేగిన మంటలతో భారీ ఎత్తున హరిత విధ్వంసం జరిగింది. ఇలాంటి వాటిని అరికట్టాలి. దీంతోపాటు ఏటా భూమ్మీద పెద్ద ఎత్తున పచ్చటి వనాలు సృష్టించగలిగితేనే ప్రకృతిని నిలబెట్టుకోగలుగుతాం.

జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం సమగ్ర వ్యూహాత్మక, వికేంద్రీకృత ప్రణాళికలను అమలు చేయాలి. ఇప్పటికే అతిపెద్ద సముద్ర జీవుల్లో ఒకటైన వేల్ షార్క్ (తిమింగలం) వంటివి ఎన్నో అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరుతున్నాయి. పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించాలి. సత్వరం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే 2050 నాటికి ఊహకందని విపరీత పరిణామాలెన్నో చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జీవ వైవిధ్య సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత అనే కాకుండా ప్రభుత్వేతర సంస్థలతో పాటు ప్రజలు, పౌర సమాజం.. వివిధ జీవజాతుల ఆవాసాల సంరక్షణపై దృష్టి సారించాలి. పర్యావరణ అనుకూల, పర్యావరణ హితకర ఉత్పాదకాలను మాత్రమే వినియోగించాలి. తద్వారా జీవ వైవిధ్య సంరక్షణకు పాటు పడవచ్చు. జీవ వైవిద్య వనరుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములం కావాలి. అప్పుడే మానవాళి భవితకు భరోసా.
ఉదయ్ శంకర్ ఆకుల 7989726815