2న జెండా ఆవిష్కరణతో మహాసభ ప్రారంభం
అదే రోజు మధ్యాహ్నం భారీ ప్రదర్శన, బహిరంగ సభ
హాజరుకానున్న కేరళ మంత్రి రాజీవ్, జాతీయ నేతలు
1నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు
అదే రోజు జిల్లాకు చేరనున్న
కార్మిక చైతన్య యాత్రలు
2న గూడెం నుంచి భీమవరం వరకూ
మోటార్ సైకిల్ ర్యాలీ
ప్రజాశక్తి - భీమవరం
భవిష్యత్ ఉద్యమాల వేదికగా సిఐటియు రాష్ట్ర 16వ మహాసభ నిర్వహించుకుంటున్నామని, ఈ మహాసభలో అన్ని వర్గాల ప్రజలూ పాల్గొని జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, పిడిఎఫ్ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ తెలిపారు. స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించి మహాసభ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు అమలుకై సిఐటియు నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ నిరంతరం ప్రజా ఉద్యమాల నాయకత్వం వహించే సిఐటియు 16వ రాష్ట్ర మహాసభ భీమవరం పట్టణంలో జనవరి 2, 3, 4 తేదీల్లో ఘనంగా జరగనున్నాయని తెలిపారు. మొదటి రోజు 2వ తేదీన వేలాది మంది కార్మికులతో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. మొత్తంగా 26 జిల్లాల నుంచి 800 మంది కార్మిక, ఉద్యోగ, సంఘాల నాయకులు ప్రతినిధులుగా హాజరవుతారని పేర్కొన్నారు. కార్మిక వర్గ, ఉద్యోగ వర్గ, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ కార్మికులు, సామాన్య చిరుద్యోగుల కోసం, నిరుద్యోగం, ఉద్యోగ భద్రత వంటి వాటిపై చర్చించి రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం రాష్ట్ర మహాసభ వేదికగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
2న సిఐటియు జెండా ఆవిష్కరణతో మహాసభ ప్రారంభం
రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్
మల్టీఫ్లెక్స్ వెనకాల అల్లూరి శ్రీరామరాజు కళ్యాణ మండపంలో జనవరి 2న సిఐటియు జెండా ఆవిష్కరణతో రాష్ట్ర మహాసభ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్ తెలిపారు. భీమవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మహాసభలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది కార్మిక నాయకత్వం ప్రతినిధులుగా హాజరుకానున్నారని, మూడు రోజులపాటు కార్మికుల సమస్యలపై స్థూలంగా చర్చించి భవిష్యత్ ఉద్యమాలపై కార్యాచరణ రూపొందించనున్నారని తెలిపారు. ఈ నెల 28 నుంచి ఇచ్ఛాపురం, కుప్పం, శ్రీకాకుళం జిల్లా మందాడలో మూడు బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయని, ఒకటో తేదీన జిల్లాలోకి తాడేపల్లిగూడెం వద్ద ప్రవేశస్తాయని తెలిపారు. రెండో తేదీన తాడేపల్లిగూడెం నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ భీమవరం వరకూ సాగుతుందని, అక్కడ ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఒకటో తేదీ సాయంత్రం నుంచి కేశవరావు హైస్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో కార్మికులకు ఏ సమస్యలొచ్చినా వారి రక్షణ, ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం సిఐటియు అనేక ఉద్యమాలు చేపట్టిందని గుర్తు చేశారు. పరిశ్రమలు మూతపడి రోడ్డున పడ్డ కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి వారికి అండగా సిఐటియు నిలించిందని గుర్తుచేశారు. మోడీ పాలనలో శ్రమకు తగ్గ వేతనమే కాకుండా కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయకుండా నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయకుండా కార్మికులకు అన్యాయం చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై కార్మికులందరూ ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
మహాసభకు ప్రముఖులు హాజరు
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రారు
భీమవరంలో సిఐటియు రాష్ట్ర మహాసభ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని, ఈ మహాసభకు కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు హాజరుకానున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్ రారు అన్నారు. ముఖ్యఅతిథిగా కేరళ పరిశ్రమల శాఖ, న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్, సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత, ప్రధాన వక్తలుగా, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నర్సింగరావు, ఎంఎ గఫూర్, ఉభయగోదావరి జిల్లాల పిడిఎఫ్ ఎంఎల్‌సిలు ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ, అఖిలభారత ఉపాధ్యక్షులు జి.బేబీరాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ మహాసభలో కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపారవేత్తలు మేధావులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్, నాయకులు బి.వాసుదేవరావు పాల్గొన్నారు.










