
భవిష్యత్తరాలకు తెలుగు వెలుగులు పంచాలి
- తెలుగు భాషా వైభవమే ధ్యేయం : సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు
ప్రజాశక్తి - నంద్యాల
భవిష్యత్తరాలకు తెలుగు వెలుగులు పంచుతూ, తెలుగు భాషా వైభవాన్ని చాటడమే సాహితీ స్రవంతి ధ్యేయమని సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టనంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీలోని మినీ ఆడిటోరియంలో సాహితీ స్రవంతి నంద్యాల శాఖ ఆధ్వర్యంలో 'విద్య - సాహిత్యం' అంశంపై సదస్సు జరిగింది. ప్రధాన వక్తగా జంధ్యాల రఘుబాబు హాజరై మాట్లాడారు. తెలుగు సాహిత్యాన్ని నేటి తరానికే కాదు, భవిష్యత్ తరానికి కూడా అందించాలన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో వివిధ సాహిత్య కార్యక్రమాలు, వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో సాహిత్యాభిలాషను పెంపొందించాలని చెప్పారు. విద్యార్థులు సాహిత్య రచనలు చేసేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం జరిగిన సాహితీ స్రవంతి జిల్లా విస్తత స్థాయి సమావేశంలో సభాధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడారు. నేటి యువతరానికి తెలుగు భాషా ప్రాముఖ్యతకు, మనిషిలో పతనమవుతున్న మానవీయ విలువలను పెంపొందించేందుకు, తెలుగుభాష పరిరక్షణకు సాహితీ స్రవంతి నిరంతరం కృషి చేస్తుందన్నారు. ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యాసంస్థల ఛైర్మన్ డా.జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి యువతను సన్మార్గంలో నడిపించేందుకు సరైన దిశానిర్ధేశం చేసేలా విస్తృతంగా కార్యక్రమాలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశలో నడవటానికి రామకృష్ణ విద్యాసంస్థలు ఎల్లప్పుడు తమ సహకారాన్ని అందిస్తా యన్నారు. కళారాధన కార్యదర్శి గౌరవ అతిథి డా.జి రవికృష్ణ మాట్లాడుతూ కనుమరుగవుతున్న మన కళలను బతికించుకోవాలని కవులకు, రచయితలకు కోరారు. అనంతరం జాతీయ విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకొని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి ముత్తోజ్ వీరబ్రహ్మం, ఆముదాల మురళి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మాదాల శ్రీనివాసులు, శేషఫణి, అతిథులు నివాళులర్పించారు. అతిథులు డా.జి రామకృష్ణా రెడ్డి, డా.జి రవికృష్ణలకు అందించిన ప్రశంసా పద్యసుమాలను డా.వైష్ణవ వేంకటరమణమూర్తి ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులు నీలకంఠమాచారి, మాబుబాష, నరేంద్ర, మరియదాసు, గద్వాల రామకృష్ణ, కన్నయ్యలు వినిపించిన కవితలు పలువురి ప్రశంసలందుకున్నాయి. కార్యక్రమంలో కవులు, రచయితలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాహితీ స్రవంతి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సాహితీ స్రవంతి జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు సభచే ఆమోదింపచేసి ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా యం.శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షులుగా అన్నెం శ్రీనివాసరెడ్డి, మాదాల శ్రీనివాసులు, మణిశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డా.నీలం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా శేషఫణి, మహబూబ్ బాష, సరస్వతిలు, కమిటీ సభ్యులు నీలకంపఠమాచారి, నరేంద్ర, మరియదాసు, రమేష్, రామచంద్రమూర్తి, సుధీర్, కన్నయ్య, బాబాఫకృద్ధీన్, కళ్యాణ్, మధుసూధన్, జనార్ధన్ రెడ్డి, సాహిత్య ప్రస్థానం మాసపత్రిక కోఆర్డినేటర్‌గా రఫిలను ఎన్నుకున్నారు.