
ప్రజాశక్తి - తెనాలి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడపలో ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 8న నిర్వహించే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ పిలుపునిచ్చారు. తెనాలిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటించిన నాటి నుండి కార్మికులు దీక్షలు చేస్తున్నారని, ఆ దీక్షలు నవంబర్ 8వ తేదీ నాటికి 1000 రోజులు పూర్తి చేసుకుంటాయని చెప్పారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే నేడు చదువుతున్న విద్యార్థులు భవిష్యత్‌లో ఉద్యోగావకాశాలు కోల్పోతారని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తప్ప మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ పరిశ్రమ లేదని గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారని, మరోవైపు పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పరిశ్రమలు లేకుండా చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కడ ఉద్యోగాలు చేయాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాల కోసం చేస్తున్న ఆందోళనల్లో విద్యార్థులంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ తెనాలి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఉదరు ఈశ్వర్, కె.సుభాష్, ఉపాధ్యక్షులు ఎ.సాత్విక్, ఎన్.వినరు, సహాయ కార్యదర్శులు వై.శశికాంత్, సిహెచ్ నరేంద్ర పాల్గొన్నారు.