Oct 19,2023 23:46

సమాచార పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్‌.సురేష్‌కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడానికి పరిశ్రమ-అకాడమీ మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ అన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక ఉండాలని, విద్యార్థులు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలనూ పొందగలిగేలా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు, ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌ అధికారులకు సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ మంచి విద్యా బోధనకు అధ్యాపకుల శిక్షణను తప్పనిసరి చేయాలని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాంకేతిక విద్య కమిషనర్‌ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ల ముంగిటకు బహుళజాతి కంపెనీలను తీసుకురావడం ద్వారా డిప్లొమా విద్యార్థులకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పరిశ్రమలతో అవగాహన ఒప్పందాల అమలు, పాఠ్యప్రణాళిక పునరుద్ధరణలో పరిశ్రమల భాగస్వామ్యం, ఫ్యాకల్టీ ఇండస్ట్‌ వంటి పరిశ్రమల అనుసంధాన కార్యక్రమాల నిర్వహణతో అర్ధవంతమైన సాంకేతిక విద్యను అందించామన్నారు. ఎన్నడూ లేని విధంగా దాదాపు 60 శాతం మంది విద్యార్థులకు ఈ సంవత్సరం ఉపాధిని చూపామని తెలిపారు. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కెఎన్‌ లక్ష్మీపతి మాట్లాడుతూ ఇండిస్టీ-అకాడమీ సహకారం యొక్క కీలక పాత్రను గుర్తించి పాలిటెక్నిక్‌ అధ్యాపకులకు నెల రోజుల పాటు పారిశ్రామిక శిక్షణ ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. సుజ్లాన్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ మరియప్పన్‌ మాట్లాడుతూ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంపొందించడానికి విద్యారంగం, పరిశ్రమల మధ్య సహకారం అవసరమని చెప్పారు. హెస్ట్‌ అల్లారు ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఆంజనేయ ప్రసాద్‌ మాట్లాడుతూ ఫౌండ్రీ రంగంలో డిప్లొమా విద్యార్థులకు అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమ, విద్యా వ్యవస్థల మధ్య సంబంధాలు మెరుగవ్వాలని చెప్పారు. పరిశ్రమ-విద్యా సహకారాన్ని సులభతరం చేయడంలో అమూల్యమైన మద్దతు ఇచ్చినందుకు - వీల్స్‌ ఇండియా, రాయల్‌ ఎన్ఫీల్డ్‌, హెచ్‌ఎల్‌ మండో ఆనంద్‌, ఎఫ్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ సంస్ధలకు ఇండిస్టీ కనెక్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డును ప్రదానం చేశారు. ప్లేస్‌మెంట్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాలిటెక్నిక్‌లకు బెస్ట్‌ ప్లేస్‌మెంట్‌ పెర్ఫార్మర్‌ అవార్డులు ప్రదానం చేశారు. ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ నంద్యాల, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విజయవాడ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విశాఖపట్నం, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విశాఖపట్నం, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ గుంటూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ రాజమండ్రి, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ అనకాపల్లి, ఆదిత్య ఇంజనీరింగ్‌ కాలేజ్‌ సూరంపాలెం వరుసగా తొలి ఎనిమిది స్థానాలను దక్కించుకున్నాయి. వెబ్‌సైట్‌ డిజైన్‌ కాంపిటీషన్‌లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌-భీమునిపట్నం విద్యార్థులు విజయం సాధించి రూ.50 వేల బహుమతిని పొందారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ ప్రగతి, సాక్షం, స్వానత్‌ స్కాలర్‌షిప్‌ల వివరాలతో కూడిన సమాచార పోస్టర్‌ను సైతం ఆవిష్కరించారు. జాయింట్‌ డైరెక్టర్‌ వి.పద్మారావు, ఆర్జేడీ-ఏయూ రీజియన్‌ జె.సత్యనారాయణమూర్తి, ఆర్జేడీ-ఎస్వీయూ రీజియన్‌ ఎ.నిర్మల్‌ కుమార్‌ ప్రియ, ఎస్‌బీటీఈటీ కార్యదర్శి కెవి.రమణబాబు పాల్గొన్నారు.