![](/sites/default/files/2023-11/tdp_23.jpg)
ప్రజాశక్తి - పాలకొండ : రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం, జనసేన సమన్వయంతో పని చేయాలని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తామని ఆపార్టీల నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానికంగా ఉన్న హోటల్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు నిమ్మక జయకృష్ణ, జనసేన నాయకులు నిబ్రం మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలా వెనుక్కి వెళ్లిపోయిందని, ప్రజలు చైతన్యమై రాష్ట్రాన్ని, ముందుతరాల భవిష్యత్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికల పొత్తుల్లో భాగంగా రెండు పార్టీలు సమన్వయంతో పని చేసి వైసిపిని గద్దెదించుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించినట్లు వెల్లడిరచారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కర్నేన అప్పలనాయుడు, పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, జనసేన పార్టీ జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, పాలకొండ పట్టణ టిడిపి అధ్యక్షులు గంటా సంతోష్, మండల అధ్యక్షులు గండి రామినాయుడు, వీరఘట్టం మండల పార్టీ అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్, జనసేన నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు, భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచారకర్త తోక సంధ్యారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కురుపాం : తెలుగుదేశం, జనసేన పార్టీలు కుటుంబ సభ్యులు సమిష్టిగా కలిసి పనిచేసే కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేద్దామని టిడిపి కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. కురుపాంలో సాయిరాం గుడి మైదానం వద్ద టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కావున టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రావడనికి అంతాకష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసిపి ఉమ్మడి జిల్లాల జనసేన సీనియర్ నాయకులు లోకం ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కె.మల్లేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, టిడిపి సీనియర్ నాయకులు కెవి కొండయ్య, మధు, మర్రాపు పురుషోత్తం నాయుడు, దేవ కోటి వెంకటరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు: రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం తో వైసిపి ఓటమి ఖాయమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి చెప్పారు. స్థానిక టిడిపి కార్యాలయంలో జనసేన నాయకులతో కలిసి టిడిపి నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణి,పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు,మక్కువ మండల అధ్యక్షులు జి.వేణుగోపాల్, పాచిపెంట మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్ బాబు, సాలూరు మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్, మెంటాడ మండల సీనియర్ నాయకులు గెద్ద అన్నవరం, ముసలి నాయుడు, జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ గేదెల రిషి వర్ధన్, పట్టణ నాయకులు శివకష్ణ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సంధ్యారాణి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నాయని చెప్పారు.