Sep 01,2022 23:16

శిక్షణలో పాల్గొన్న ప్రతినిధులతో విసి ప్రసాద రెడ్డి తదితరులు

-ఇంక్యుబేటర్‌ మేనేజర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం ప్రారంభం
-మూడు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు
ప్రజాశక్తి- విశాఖపట్నం :
భవిష్యత్‌ ఆవిష్కర్తలను తయారు చేయాల్సిన అవసరం ఉందని ఎయు విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి అన్నారు. గురువారం ఎయులోని అమెరికన్‌ కార్నర్‌లో రెండు రోజుల ఇంక్యుబేటర్‌ మేనేజర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ స్వరూపాన్ని మార్చేసిన ఇంటర్నెట్‌ సదుపాయం అందరికీ అందుబాటులోనికి రావడం వెనుక జరిగిన పరిశోధనను ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. కంప్యూటర్‌తో పరిచయం లేని వ్యక్తులు సైతం ఎంతో ప్రభావంతమైన మార్పులకు ఆధ్యులుగా నిలచిన సంఘటనలను ఉదహరించారు. నేటి తరానికి ఆవిష్కర్తలుగా మార్చడానికి అవసరమైన మార్గాన్ని నిర్మించామన్నారు. ఆలోచనే నేడు నిజమైన సంపదగా నిలుస్తుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇంక్యుబేషన్‌, ఇన్నోవేషన్‌కు అనువైన పరిస్థితుల కల్పించడం, యువత నుంచి భవిష్యత్‌ ఆవిష్కర్తలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విశ్వవిద్యాలయాలు సమన్వయం చేస్తూ పనిచేయడం ఎంతో అవసరమన్నారు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విద్యార్థులు సైతం తమ ఆలోచలు పెట్టుబడిగా అభివృద్దిని సాధించడం వీలవుతోందన్నారు. కార్యక్రమంలో డేవిడ్‌ జోయిల్‌, ఎసిఐఆర్‌ వ్యవస్థాపకుడు ఎరిక్‌ అజులే, యుఎస్‌ కాన్సులేట్‌ ప్రతినిధి జోరు క్రిష్టోఫర్‌, ఎయు రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, ఎయు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సిఇఒ రవి ఈశ్వరపు పాల్గొన్నారు.