దుర్గగుడి ఈవో దర్భముళ్ల భ్రమరాంబ
ప్రజాశక్తి - వన్‌టౌన్
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో డిసెంబర్ 15 నుండి 19 వరకు ఐదు రోజులపాటు శ్రీ అమ్మవారి భవాని దీక్ష విరమణలు అన్ని శాఖల సమన్వ యంతో అత్యంత వైభవంగా మరియు దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంభ చెప్పారు. శనివారం దుర్గగుడి మహామండపం ఆరవ అంతస్తులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతు పై ఐదు రోజులకు భవానీలు, సాధారణ భక్తులు కలిపి సుమారుగా మొత్తం 5 లక్షల 40 వేల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారన్నారని తెలిపారు. గత సంవత్సరం మొత్తం 3 లక్షల 50 వేల మంది, 2020 సంవత్సరంలో (కోవిడ్ సమయం) 1,50,000 ల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారని ఆమె వివరించారు. ఈ ఐదు రోజులలో సుమారు 15 లక్షల పైగా లడ్డూలు భక్తులు కొనుగోలు చేశారని చెప్పారు. ఈ ఐదు రోజులలో సుమారు 23,700 వేలమందికి అన్న ప్రసాదం, 78,614 మందికి ఉచిత ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు. మరియు దేవస్థానం వారు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం రూ.6,15,69, 182లు, ఈ సంవత్సరం రూ.7,68, 47,089లు ఆదాయం వచ్చినదని, గత సంవత్సరం సుమారు రూ. 4 కోట్లు ఖర్చు కాగా, ఈ సంవత్సరం సుమారు రూ. 6 కోట్లు ఖర్చు అయినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సమావేశంలో ఇఇ కోటేశ్వరరావు, రమ, ప్రధానార్చకులు పాల్గొన్నారు.










