ప్రజాశక్తి - వన్‌టౌన్
కృష్ణానదిలోని భవానీద్వీపంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. శనివారం భోగి పండుగ పర్వదినం పురస్కరించుకుని సంక్రాంతి శోభ ఉట్టిపడేలా భోగిమంటలు, ముగ్గులు, గొబ్బిమ్మలు, హరిదాసుల సందడితో వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. శనివారం భవానీ ద్వీపంనకు ప్రముఖ సినీనటి ఆమని పాల్గొని సందడి చేశారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు ఈనెల 16వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా భవానీద్వీపంలో తాటాకు ఇళ్లను ఏర్పాటుచేయడంతో పాటుగా హరిదాసులు, పిట్టలదొరలు, గంగిరెద్దులవారు, సన్నాయి మేళం తదితరాలతో ద్వీపం అంతా కోలాహలంగా మారింది. అలాగే అనేక రకాల ఆటలతో పిల్లలు కేరింతలు కొడుతూ కన్పించారు. కుటుంబ సభ్యులతో కలిసివచ్చిన వారు ద్వీపం అంతా కలియతిరుగుతూ సందడిచేశారు. శనివారం ఉదయం నుంచే వేలాదిమంది సందర్శకులు భవానీ ద్వీపంనకు తరలిరావడంతో బోటింగ్ పాయింట్ వద్ద క్యూలైన్లు ఏర్పాటుచేసి వరుసక్రమంలో పంపించారు. భవానీద్వీపం మేనేజర్ సుధీర్ పర్యవేక్షణలో ద్వీపంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏపీ టూరిజం సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.










