Dec 13,2022 23:02

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతి పెద్ద రెండవ దేవాలయంగా పేరుగాంచిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి భవాని దీక్ష విరమణ మహాోత్సవాలు ఈనెల 15 నుండి 19వ తేదీ వరకూ అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈ సందర్భంగా మన రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో విచ్చేయు భవానీ భక్తుల కోసం దేవాలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాగత ద్వారాలు ఏర్పాటుచేశారు. భవానీ దీక్షల మాల విరమణకు వచ్చే భవానీలు దుర్గగుడి నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, కబేళా రోడ్డు మీదుగా మిల్క్‌ ప్రాజెక్ట్‌, చిట్టినగర్‌, బ్రాహ్మణ వీధి గుండా గిరిప్రదక్షిణ చేసి, అమ్మవారి మొక్కలు తీర్చుకునే ఆచారం. ఈ నేపథ్యంలో వచ్చే భవానీ భక్తుల కోసం దుర్గగుడి అధికారులతో పాటు రెవెన్యూ, విఎంసి, పోలీస్‌ ఇలా పలు శాఖల సమన్వయంతో భవానీ దీక్షల విరమణ మహాోత్సవాల్లో సహకారం అందిస్తారు. వచ్చే భవానీల కోసం సుమారు 20 లక్షల వరకూ లడ్డూలు సిద్ధం చేసే పనిలో దేవాలయ అధికారులు నిమగమయ్యారు. అలాగే మూడు హాోమగుండాలు, పది లడ్డూ కౌంటర్లు కూడా కనకదుర్గా నగర్‌లో సిద్ధం చేశారు. సీతమ్మవారి పాదాల ఘాట్‌ వద్ద 500, భవానీఘాట్‌ వద్ద 100, పున్నమిఘాట్‌ వద్ద 200 బాత్‌ షవర్లు సిద్ధం చేస్తున్నారు. 15 లక్షల వాటర్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. భవానీలు ఉచిత దర్శన భాగ్యం కల్పించారు. మొత్తం మీద 20 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లకు 3,500 మంది పోలీసులు సేవలు అందించనున్నారు. భవానీలకు సేవలు అందించేందుకు ఇతర దేవాలయాల నుండి డిప్యూటేషన్‌పై 200 మందిని రప్పిస్తున్నట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. వినాయకుని గుడి వద్ద నుండి భవానీలు క్యూ లైను మార్గం గుండా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా హాోమగుండాలకు చేరుకుని మొక్కులు తీర్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. దీనికోసం మూడు హాోమ గుండాలు, ప్రసాదం కౌంటర్లు, క్యూ లైన్‌ లు, మొబైల్‌ టాయిలెట్లు, కేశఖండన, స్నానపు ఘాట్లు మరియు ఇతర ఏర్పాట్లు అన్ని సిద్ధం చేశారు. భవానీలు గిరి ప్రదక్షిణ నేపధ్యంలో చిట్టినగర్‌ కెటి రోడ్డును సిద్ధం చేస్తున్నారు. అయితే కెటి రోడ్డు ఒకవైపు సిమెంట్‌ రోడ్డు నిర్మాణం జరగ్గా, మరోవైపు నిర్మాణంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజుల్లో పనులను నిలిపివేసి ఆ రోడ్డును కూడా సరిచేసి అందుబాటులో తెచ్చేవిధంగా పనులు చేపట్టారు.