ఈ ఒప్పందానికి భూటాన్ కట్టుబడి ఉంటే మరోసారి డోక్లాం ఉదంతం పునరావృతమయ్యే అవకాశం లేదు. వర్తమాన ప్రపంచ రాజకీయ పరిణామాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది చైనా. వాటిలో మన దేశంతో సహా అనేక దేశాలతో చరిత్ర సృష్టించిన సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వివాదాన్ని చైనా పరిష్కరించుకొనే దిశలో ఉంది. ఆ క్రమంలో ఇదొక కీలక అడుగు.
కేవలం ఎనిమిది లక్షల లోపు జనాభా ఉన్న భూటాన్‌తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనా ఒక ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది. చైనా-భూటాన్-భారత్ త్రికోణ కూడలికి దగ్గరలో నాలుగు సంవత్సరాల నాడు తీవ్ర వివాదంగా మారిన డోక్లాం ప్రాంతం ఉంది. అది ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ భూటాన్ తనదిగా చెబుతోంది. దానితో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఆ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డు, ఇతర నిర్మాణాలు చేసేందుకు 2017లో చైనా ప్రయత్నించినపుడు మన సైన్యాలు అడ్డుకున్నాయి. డెబ్బై మూడు రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. రోడ్డు నిర్మాణాన్ని చైనా నిలిపివేసిన తరువాత సద్దుమణగింది. వేస్తున్న రోడ్డును ఆపివేసింది తప్ప చైనా ఆ ప్రాంతంలోనే అప్పటి నుంచీ కొనసాగుతోంది. సిక్కిం వైపు నుంచి నిర్ధారిత సరిహద్దు నుంచి 2017 జూన్ 18న భారత సైన్యం తమ భూభాగం లోకి ప్రవేశించి అతిక్రమణకు పాల్పడిందని అప్పుడు చైనా విమర్శించింది. మూడు దశలుగా లేదా మూడంచెలలో వివాదాలను పరిష్కరించుకొని రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్నది ఒప్పందం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి వుంది.
దీని గురించి ఎవరికి వారు తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యానించారు. వివాదం ఉన్న వాటిలో డోక్లాంను తమకు అప్పగిస్తే దానికి బదులు ఇతర ప్రాంతాల మీద హక్కును వదులుకుంటామని చైనా చెబుతోంది. భూటాన్ మొత్తం విస్తీర్ణం 38 వేల చదరపు కిలోమీటర్లు, నాలుగు వందల కిలోమీటర్ల మేరకు చైనాతో సరిహద్దును కలిగి ఉంది. రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం 765 చదరపు కిలోమీటర్లు.
త్రికోణ కూడలి ఇటు మన దేశానికి చైనాకు ప్రాధాన్యత కలిగినవే. మన ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతం కూతవేటు దూరంలో ఉంది. పరస్పరం అనుమానాలు ఉన్నందున డోక్లాం చైనా ఆధీనంలో ఉండేందుకు మన దేశం అంగీకరించటం లేదు. భూటాన్ విషయానికి వస్తే అటు చైనా ఇటు మన దేశంతో దానికి భద్రతాపరమైన ముప్పు ఉందని భావించటం లేదు. మన దేశం-భూటాన్ మధ్య ఒక చిత్రమైన ఒప్పందం ఉంది. తరువాత అది అనేక మార్పులకు లోనైంది.
1949 ఆగస్టు 8న కుదిరిన స్నేహ ఒప్పందం ప్రకారం అంతర్గత వ్యవహారాలలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. 1958లో నాటి ప్రధాని నెహ్రూ భూటాన్ సందర్శించిన తరువాత పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ భూటాన్ మీద ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే అది భారత్ మీద జరిపినట్లే పరిగణిస్తామని ప్రకటించారు.
2007లో 1949 నాటి ఒప్పందాన్ని నవీకరించారు. అంతకు ముందు భూటాన్ సరిహద్దు సార్వభౌమత్వం గురించిన విదేశాంగ విధానంలో భారత మార్గదర్శనం చేయాలని ఉన్న అంశాన్ని తొలగించారు. ఆయుధ దిగుమతులకు కూడా భారత అనుమతి అవసరం లేదని సవరించారు. ఒప్పందంలో ఈ మార్పులు జరిగినప్పటికీ మన దేశం మీద భూటాన్ అనేక అంశాలలో ఆధారపడటం వంటి కారణాలతో ప్రభావితమైంది.
సరిహద్దులతో సహా భూటాన్ పూర్తి సార్వభౌమత్వ దేశంగా ఉన్నట్లు చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రపంచానికి స్పష్టంగా తెలియచేసింది. ఈ కారణంగానే కావచ్చు. లేదా వివరాలు పూర్తిగా వెల్లడికానందున గానీ భారత్ ఆచితూచి స్పందించింది.
చైనా-భూటాన్ మధ్య అవగాహన కుదిరినప్పటికీ అది సజావుగా ముందుకు పోతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఒప్పందం గురించి మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ 'అవగాహన కుదిరినట్లు గమనించాము. 1984 నుంచి రెండు దేశాలు సరిహద్దు గురించి సంప్రదింపులు జరుపుతున్నాయి. మనమూ చైనాతో సంప్రదింపుల్లోనే ఉన్నాం' అని క్లుప్తంగా స్పందించారు. భారత్‌కు తెలియచేయకుండా భూటాన్ ఒప్పందం చేసుకుందా అన్న ప్రశ్నకు బాగ్చీ స్పందించలేదు. తమ సరిహద్దు చర్చలకు ఇది నూతన ఉత్సాహాన్నిస్తుందని, విజయవంతంగా ముగుస్తుందనే ఆశాభావాన్ని భూటాన్ వ్యక్తం చేసింది. అమెరికా పంచన చేరి చైనాను నిలువరించాలని, సరిహద్దు వివాదాలను ఆయుధమయం కావించాలని చూస్తున్న నరేంద్రమోడీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అని చైనా టీవీ సిజిటిఎన్ పేర్కొన్నది.
భూటాన్‌ను తన చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు అంతర్జాతీయ సంబంధాలు పెట్టుకోకుండా మన దేశం నిలువరించిందనే విమర్శలను చైనా చేసింది. గతంలో భూటాన్ తరఫున సరిహద్దు సమస్యను తమతో చర్చించాలని భారత్ ప్రతిపాదించిందని అది విఫలం కావటంతో భూటాన్ మీద ఒత్తిడి తెచ్చినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసింది.
ఈ ఒప్పందానికి భూటాన్ కట్టుబడి ఉంటే మరోసారి డోక్లాం ఉదంతం పునరావృతమయ్యే అవకాశం లేదు. వర్తమాన ప్రపంచ రాజకీయ పరిణామాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది చైనా. వాటిలో మన దేశంతో సహా అనేక దేశాలతో చరిత్ర సృష్టించిన సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వివాదాన్ని చైనా పరిష్కరించుకొనే దిశలో ఉంది. ఆ క్రమంలో ఇదొక కీలక అడుగు. నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన ఒక్క భూటాన్‌తో తప్ప మిగిలిన అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అయితే భూటన్‌కు ఐరాస భద్రతా మండలి లోని ఏ ఒక్క శాశ్వత సభ్య దేశంతో కూడా సంబంధాలు లేవు. ఇదొక విచిత్రమైన స్ధితి. ఈ ఒప్పందంతో చైనాతో సంబంధాలు ఏర్పడితే పెనుమార్పులేమీ సంభవించవుగానీ అమెరికా దాని కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.
- ఎం. కోటేశ్వరరావు










