Jul 18,2023 21:22

ఎర్ర కాలువ మిగులు భూముల పేదలపై అక్రమ కేసులు, బెదిరింపులు
పేదలకు సాగుకు అవకాశం కల్పిస్తూ ఎక్‌సాల్‌ పట్టాలివ్వాలి : వ్యకాస డిమాండ్‌
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

భూస్వాములతో కుమ్మకై పేదలను భయబ్రాంతులకు గురిచేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్న రెవెన్యూ ఇరిగేషన్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి డిమాండ్‌ చేశారు. ఎర్రకాలువ మిగులు భూములకు ఎక్స్‌ఎల్‌ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిదేళ్ల నుండి ఎర్రకాలువ మిగులు భూములు పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఆ ప్రాంతంలో ఉన్న పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం అందరికీ సమానమేనని చెబుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఇరిగేషన్‌ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇరిగేషన్‌ భూముల్లో పేదలు సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శిం చారు. ఈ భూములు గత 35 ఏళ్లగా స్థానిక భూస్వాములు అమ్ముకుని నేటికీ దర్జాగా వాణిజ్య పంటలు పామాయిల్‌, కొబ్బరి, చెరకు, మొక్కజొన్న, పొగాకు వంటి పంటలు చట్ట వ్యతిరేకంగా పండిస్తున్నా ఇరిగేషన్‌ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. భూస్వాములు పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. భూముల్లోకి వెళితే పేదలపై అక్రమ కేసులు పెట్టి, మహిళలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.జీవ రత్నం, పి.రామకృష్ణ మాట్లాడుతూ టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం, అప్పలరాజుగూడెం, అబ్దుల్లాపురం, సాలిగూడెం, మల్లప్పగూడెం జంగారెడ్డిగూడెం మండలంలో ఎ.పోలవరం, చిన్నవారిగూడెం, తాడువాయి, వేగవరం, చక్రదేవరపల్లి, ఎర్రకాలువ ప్రాజెక్టు ఇరిగేషన్‌ భూముల్లో పేదలు వేసుకున్న కొబ్బరి మొక్కలు పీకేసి దళిత మహిళలపై దాడి చేసి కొట్టి కులం పేరుతో దూషించిన భూస్వాములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇరిగేషన్‌ భూముల్లో పేదలు ఏడాది నుంచి కొబ్బరి మొక్కలు వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. ఇది ఓర్వలేని భూస్వాములు కొబ్బరి మొక్కలు పీకివేసి 'ఆ మొక్కలు మేమే వేశాము.. పేదలు పీకేశారు' అంటూ పోలీస్‌ స్టేషన్లో పేదలపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇరిగేషన్‌ భూముల్లో ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేయకుండా పేదలపై కేసులు ఎందుకు నమోదు చేశారో పోలీసులు ప్రజలకు తెలియజేయాలని కోరారు. మహిళలపై దాడి చేసిన భూస్వాములపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెలాఖరుకి సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఎర్ర కాలువ పోరాటంలో ఉన్న పేదలందరితో కలిసి ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి.సత్యనారాయణ, ఎస్‌.మహంకాళిరావు, జి.సూర్యకిరణ్‌, యాగంటి సీత, పి.చంటి, కె.సుబ్బారావు, మొగలి మంగ, తోనం సోమాలమ్మ, రామలక్ష్మి, దుర్గమ్మ పాల్గొన్నారు.