Aug 14,2023 21:54

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
        భూస్వాములకు ఎసైన్డ్‌ భూములను కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎసైన్డ్‌ చట్ట సవరణ చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు విమర్శించారు. దేశానికీ స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పేదల భూములు భూస్వాముల కబంధహస్తాల్లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, పేదలు, దళితులు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేసిన ఫలితంగా 9/77 చట్టం వచ్చిందని, కానీ నేడు ప్రభుత్వం అసైన్డ్‌ భూములను అక్రమంగా అనుభవిస్తున్న వారికే యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేయడం దుర్మార్గమని వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్‌ భూముల ఆర్డినెన్స్‌ సవరణల నిర్ణయం వల్ల అసైన్డ్‌దారుల కంటే అక్రమంగా, దౌర్జన్యంగా అనుభవిస్తున్న భూస్వాములే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని మండిపడ్డారు. గతంలో కూడా అసైన్డ్‌ చట్ట సవరణ వల్ల పేదలకంటే అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అసైన్డ్‌ లబ్ధిదారుల లిస్టులను గ్రామ సచివాలయంలో బహిరంగపరచాలని కోరారు. అందులో అర్హులకే యాజమాన్యపు హక్కుని కల్పించాలన్నారు. అక్రమంగా అనుభవిస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17,21,160 కుటుంబాలకు చెందిన 27,41,609 ఎకరాల అసైన్డ్‌ భూముల వివరాలు ప్రతీ గ్రామ సచివాలయంలో బహిరంగపరచాలని కోరారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు సీలింగ్‌ భూములతో పాటు పేదలకు పంచడానికి అవకాశమున్న అన్ని రకాల భూములను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. భూ సమస్యలలో పోలీసుల జోక్యం ఉండకూడదన్నారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ దెందులూరు మండలం దోసపాడులో సాగుచేస్తున్న అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ద్వారకాతిరుమల మండలంలో వందలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, లింగపాలెం, చింతలపూడి మండలాల్లో నేటికీ భూస్వాముల కబంధహస్తాల్లోనే వేలాది ఎకరాలు అసైన్మెంట్‌ భూములున్నాయని తెలిపారు. టి.నరసాపురం మండలం అల్లూరి సీతారామరాజునగర్‌లో ఇళ్లస్థలాల సమస్యలు పరిష్కరించాలన్నారు. రామమ్మగూడెం భూ సమస్య, బచ్చులేటిగూడెం అటవీ భూ సమస్యలు పరిష్కరించడంలో మండల రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం, కేతవరం, చక్రదేవరపల్లి, గురవాయిగూడెం గ్రామాల్లో ఉన్న ల్యాండ్‌ సీలింగ్‌ భూములను ఆక్రమించుకున్న భూస్వాముల నుండి భూమి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో భూ రికార్డులు అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రెండు మండలాల తహశీల్దార్‌లు రికార్డులు తారుమారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పేరుతో భూములను భూస్వాములకు కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకాలువ మిగులు భూముల్లో పేదల సాగుకు అవకాశం కల్పిస్తూ ఏక్‌సాల్‌ పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. మిగులు భూముల్లో పశుపోషణకు, వ్యవసాయానికి పేదల ఉపయోగించుకుంటుంటే వాటికి పట్టాలు ఇవ్వకపోగా పోలీసులతో నిర్బంధించి అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్‌ భూముల్లో పోలీసుల దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తామా ముత్యాలమ్మ, జిల్లా కమిటీ సభ్యులు మడకం సుధారాణి, టి.సత్యనారాయణ, ఎస్‌.మహంకాళిరావు, ఎ.ప్రభాకర్‌ మాట్లాడారు.
అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ బృందం డిఆర్‌ఒకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యలను ఆర్‌డిఒ, జెసి, కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి.దాసు, ఎన్‌.సుబ్బారావు, రామలక్ష్మి, దుర్గ, రుక్మిణి, కె.సుబ్బారావు పాల్గొన్నారు.