ప్రజాశక్తి - గోనెగండ్ల
భూస్వామిపై స్వామి భక్తి ప్రదర్శించి, పేదరాలి బంకును తొలగించిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం బంకు తొలగించిన ప్రదేశాన్ని ఆనంద్ బాబు, సిపిఎం మండల నాయకులు కరుణాకర్, గ్రామస్తులు గోవిందులు, గిరి, రాజుతో కలిసి పరిశీలించారు. బాధితురాలు సకినాబీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వివరాల మేరకు... మండలంలోని బి.అగ్రహారం గ్రామంలో కొద్ది నెలల క్రితం వివిధ కారణాలతో ముగ్గురు మృతి చెందారు. వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు శ్మశానం లేక ప్రజలు ఆందోళనకు దిగారు. పంచాయతీ, ఇతర శాఖల అధికారులు స్పందించలేదు. చివరికి ఒక దశలో గ్రామ సచివాలయం ముందు అంత్యక్రియలు నిర్వహించేందుకు మహిళలు పూనుకోగా, అధికారులు ఏదో ఒకచోట ఖననం చేయించారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన పి.సకినాబీ (55) అనే మహిళ మామ మౌలాలి, భర్త హుస్సేన్ చనిపోయిన తర్వాత గ్రామంలోని నాలుగు రోడ్ల వద్ద ఆర్అండ్బి స్థలంలో నాలాపై చిన్న హోటల్ పెట్టుకుని, టీ, అల్ఫాహారం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ బంకుకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న నెపంతో పంచాయతీ కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు గతనెల 31న సిబ్బందితో తొలగించారు. అగ్రహారం గ్రామంలో 40 ఏళ్లుగా సకినాబీ ఆర్అండ్బి స్థలంలో కాలువపై నడుపుకుంటున్న హోటల్‌ను ప్రొక్లెయిన్‌తో ధ్వంసం చేయించిన పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌పై చర్యలు తీసుకుని, సకినాబీ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. గ్రామానికి ఎలాంటి అసౌకర్యమూ కలుగకపోయినా, గ్రామస్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా గ్రామ పెత్తందారు ధన దాహానికి కక్కుర్తి పడి ఉన్నతాధికారులను కూడా తప్పుదోవ పట్టించి గ్రామంలో సచివాలయ ప్రారంభానికి వచ్చిన పోలీసుల సహకారం తీసుకుని సకినాబీ టీ హోటల్‌ను కూల్చడం దుర్మార్గం. నిజంగా అడ్డుగా ఉంటే ముందస్తు నోటీసు ఇవ్వాలి. వివరణ తీసుకోవాలి. పక్కనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని షాపులు నిర్మించుకున్న భూస్వామికి అడ్డుగా వస్తుందని స్వామి భక్తిని ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శి సకినాబీ టీ హోటల్‌ను ధ్వంసం చేయించి ఆర్థిక నష్టం కలిగించారు. జిల్లాస్థాయి అధికారులు జోక్యం చేసుకొని పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌పై చర్యలు తీసుకోవాలి. సకినాబీ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే సకినాబీ కుటుంబానికి అండగా గ్రామస్తులందరినీ కలుపుకొని జిల్లావ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాం.
బంకు శిథిలాలను చూపుతున్న కుటుంబ సభ్యులు