
చిలమత్తూరు : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు రెవెన్యూ పొలం సర్వే నెం: 805లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన భూ స్వాధీన పోరాటం ఉద్రిక్తంగా మారింది. గురువారం నాడు ప్రారంభించిన ఈ పోరాటం కొనసాగింపుగా శుక్రవారం కూడా కొనసాగింది. పేదలు కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతంలో ఎర్రజెండాలు పాతి భూస్వాధీనం చేసుకున్నారు. పేదలను ఆ భూముల నుంచి వెళ్లగొట్టాలన్న ఉద్ధేశంతో అధికారులు పోలీసులతో బెదిరించే ప్రయత్నం చేశారు. అదనపు బలగాలను మొహరించి శాంతియుతంగా ఇళ్ల స్థలాల్లో కంపచెట్లను తొలగిస్తున్న పేదలు, సిపిఎం నాయకులను బలవంతంగా అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు సిపిఎం శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ఫిరంగి ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ సమయంలో పేదలు పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేశారు. ఇంతియాజ్‌తో పాటు వ్యకాసం నాయకులు వెంకటేష్, రామచంద్ర, లక్ష్మినారాయణలను అరెస్టు చేసి వాహనంలో తరలిస్తుండగా మహిళలు పోలీసు జీపును చుట్టుముట్టి అడ్డుకున్నారు. మహిళలను పక్కకు నెట్టేసి పోలీసులు నాయకులను అరెస్టు చేసి చిలమత్తూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేయనీయకుండా ఆయన చుట్టూ మహిళలు వలయంగా నిల్చున్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేయకుండా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాయకులను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళ ఊపిరాడక స్పహ తప్పి పడిపోయింది. వ్యకాసం జిల్లా అధ్యక్షుడు కిందపడడంతో ఆయన కాలు బెనికింది. పోలీసులు ఎంత బెదిరించినా మహిళలు వెనక్కు తగ్గలేదు. దీంతో చేసేది లేక పోలీసులు మిన్నకుండిపోయారు.
పోరాటానికి దిగొచ్చిన అధికారులు
వారం రోజుల్లో పట్టాలు ఇస్తామని హామీ
పోలీసులు బెదిరించి స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పినా పేదలు వినకపోవడంతో చేసేది లేక వారు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తహశీల్దార్ నాగరాజు, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి వచ్చారు. సిఐ వేణుగోపాల్, ఎస్‌ఐలు శ్రీనివాసులు, మునీర్ అహ్మద్‌ల ఆధ్వర్యంలో భూస్వాధీన పోరాట ప్రాంతంలోనే సిపిఎం నాయకులు, పేదలతో చర్చలు జరిపారు. అర్హులను వారంలోపు అందరికీ పట్టాలు ఇస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల కోసం ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఆయా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం నాయకులను అక్కడికక్కడే విడుదల చేయించారు.
వారం రోజుల్లో స్పందించకుంటే మళ్లీ పోరాటం
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్
రెవెన్యూ అధికారులు ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లోపు పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, లేనిపక్షంలో మళ్లీ పోరాటాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ తెలిపారు. అధికారులతో చర్చల సమయంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పేదలు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నా వారి గురించి పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ నెల 21వ తేదీలోపు పట్టాలు ఇవ్వకుంటే మళ్లీ భూస్వాధీన పోరాటాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజప్ప, వెంకటేష్, రామచంద్ర, పేదలు పాల్గొన్నారు. పోరాటంలో భాగంగా గాయపడిన వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, మహిళకు సిఐటియు అనుబంధ సంఘం వైద్యులు విశ్వనాథ రెడ్డి పోరాట ప్రాంతానికి వచ్చి వైద్య చికిత్సలు అందించారు.