ప్రజాశక్తి-కాకినాడ అత్యంత పారదర్శకంగా ప్రజలకు భూ యాజమాన్య హక్కుల కల్పనకు చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష కార్యక్రమంలో గ్రామాలు భూ వివాద రహితంగా ఉంటాయని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి అన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానందహాల్‌లో వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ మిషన్ సభ్యులు జె.రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ లంక ప్రసాద్, సర్వే ఎడి బి.లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి సమగ్ర భూసర్వేపై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన శాఖల అధికారులు, సర్వే, సెటిల్‌మెంట్స్, భూ రికార్డుల శాఖ అధికారులు, సమగ్ర భూసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లాలో సమగ్ర భూసర్వే పురోగతితో పాటు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపైనా చర్చించారు. కాకినాడ జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష కార్యక్రమం కింద తొలిదశలో 121 గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ పూర్తయిందని, రెండో దశలో ఇప్పటి వరకు 82 గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ పనులు పూర్తయినట్టు అధికారులు వివరించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సమర్థవంతమైన మానవవనరులతో సమగ్ర భూసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. డిజిటల్ పాస్‌బుక్‌లు సైతం అందించే ఈ బహత్తర కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి, ఉన్నత స్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.










