Jan 18,2023 23:05

ప్రజాశక్తి-జగ్గయ్యపేట, వత్సవాయి: జిల్లాలో పలు అభివద్ధి ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజరు అధికారులను ఆదేశించారు. మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేటలో జాతీయ రహదారి అప్రోచ్‌ రోడ్‌ లో అవసరమైన కల్వర్టు నిర్మాణానికి భూసేకరణ, వత్సవాయి మండలం మంగోల్లు గ్రామంలో పోరంబోకు ఆక్రమణలను క్రమబద్ధీకరించే ప్రతిపాదనలు, భూమి మార్పిడి ప్రతిపాదనలకు సంబంధించి జెసి బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు రెండు ఎకరాల భూమి అవసరం ఉందని, అదేవిధంగా షేర్‌ మహమ్మద్‌ పేటలో జాతీయ రహదారి అప్రోచ్‌ రోడ్‌ లో కల్వర్టు నిర్మాణానికి చేపడుతున్న భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. వత్సవాయి మండలం మంగోల్లు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు నమోదు, మూమెంట్‌ రిజిస్టర్‌లను జెసి పరిశీలించారు. ఈ పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ వెంట జగ్గయ్యపేట, వత్సవాయి తహసిల్దార్లు నాగేశ్వరరావు, వైకుంఠరావు ఎండిఓ ప్రసాద్‌, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌ డిఇలు, ఏఇలు ఉన్నారు.