Aug 18,2023 19:04

మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు

మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు
భూసేకరణ చట్టం ప్రకారం
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
21 జరిగే ధర్నాను జయప్రదం చేయండి
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి:జాతీయ రహదారి 67 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు రైతు సంఘం, వ్యవసాయం సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీ సోమవారం కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ రహదారి నెంబర్‌ 67 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు డిమాండ్‌ చేశారు
. జాతీయ రహదారి 67లో భూములు కోల్పోతున్న ముత్తుకూరు ,వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, చేజర్ల ,కలువాయి, అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లోని భూ నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బయలుదేరిన జాత శుక్రవారం అనంతసాగరం మండలానికి చేరుకుంది. అనంతరం మండలంలోని లింగంగుంట, పాతదేరాయపల్లి, ఇనగలూరు, వెంగంపల్లి ,ఆమని చిరువెళ్ల గ్రామాలలోని భూ నిర్వాసిత రైతులను కలిసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగల పుల్లయ్య మాట్లాడుతూ అనంతసాగరం మండలంలో మొత్తం 150 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారు. మండలాల రెవెన్యూ అధికారులు రైతులకు నష్టపరిహారం గురించి ఇంతవరకు నోటీసులు ఇవ్వకుండా, కనీసం అవార్డు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారు. చేజర్ల మండలంలోని కాకువాయి, నాగులేటూరు గ్రామాలలోని రైతులకు మోసపూరితంగా వారి వద్ద నుంచి భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంక్‌ అకౌంట్లు తీసుకొని మూడు లక్షల రూపాయలు వేయడం దుర్మార్గం అని అన్నారు.ఆరుగాలం కష్టించి భూమిని నమ్ముకునే బతికే రైతుకు ద్రోహం చేసే విధంగా మండలాల అధికారులు ఉన్నారు. భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఈనెల 21వ తేదీ సోమవారం కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద జరిగే ధర్నా కార్యక్రమం జరుగుతుంది. భూములు కోల్పోతున్న రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమ రాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి, పాత దేవరాయ పల్లి సర్పంచ్‌ రమీజా బేగం, సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌ బాషా, ,రైతు సంఘం మండల కార్యదర్శి ఉప్పలపాడు మస్తాన్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సత్తార్‌, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. అనంతరం జాత మర్రిపాడు మండలానికి బయలుదేరి వెళ్లింది.