కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నాయకులు
భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం
-ఎపి రైతు, వ్యవసాయ కార్మిక,కౌలు రైతు సంఘాలు డిమాండ్
ప్రజాశక్తి-నెల్లూరు:భారత్ మాల పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం, బహిరంగ మార్కెట్ విలువను అనుసరించి నష్టపరిహారం అందజేయాలని ఎపి రైతు, వ్యవసాయ కార్మిక,కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం కలెక్టరేట్ ఎదట రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. అనంతరం భూములు కోల్పోతున్న రైతులతో కలిసి రాయబార కార్యక్రమం నిర్వహించి కలెక్టర్‌కు రైతు సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతమాల, సాగర్‌మాల పేర్లతో జిల్లాలో రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్యలు అన్నారు. ఎన్‌హెచ్ 67, ఎన్‌హెచ్ 71 రహదారుల నిర్మాణం కోసం జిల్లాలోని మర్రిపాడు మండలం నుంచి అనంతసాగరం, చేజర్ల , కలువాయి, పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో 32 గ్రామాల్లో 2 పంటలు సాగుబడి అయ్యే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ఈ క్రమంలో భూములు కోల్పొతున్న రైతులకు ప్రభుత్వం నామ మాత్ర నష్టపరిహారం అందజేయడం దారుణమన్నారు. కౌలు రైతు సంఘం కార్యదర్శి తుళ్లూరు గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఎం.పుల్లయ్యలు మాట్లాడుతూ ప్రజాఉపయోగం కోసం ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకొనే సమయంలో భూ యజమానులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం 2013లో భూ సేకరణ చట్టాన్ని రూపొందించిందన్నారు.ఈ చట్టాన్ని అనుసరించి భూసేకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు నాలుగు రెట్లు అధికంగా, పట్టణ ప్రాంతంలో రెండు రెట్లు అధికంగా నష్టపరిహారం భూ యజమానికి చెల్లించాలన్నారు. అదే సమయంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించాలన్నారు.అందుకు భిన్నంగా ప్రభుత్వం భూసేకరణ చేస్తుందని, భూములు కోల్పొతున్న రైతుల సమస్యను ప్రభుత్వం మరో మారు పరిశీలించి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రానిపక్షంలో రైతులందరినీ ఐక్యం చేసి కోల్పోతున్న భూములకు సరైన నష్టపరిహారం కోసం పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమ్మ రాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చండ్ర రాజగోపాల్, భూ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.










