Aug 03,2023 00:27

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జెసి తదితరులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : జాతీయ రహదార్ల విస్తరణలో భూములు కోల్పోనున్న రైతులతో పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ బుధవారం గురజాల ఆర్‌డిఒ కార్యాలయంలో సమావేశమయ్యారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నుండి వెల్దుర్తి మండలం దావుపల్లి వరకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి నెం.565, మాచర్ల నుండి దాచేపల్లి మండలంలోని నడికుడి వరకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి నెం.167 ఎడి క్రింద అదనంగా సేకరించిన భూములకు భూసేకరణ చట్టం 30/2013 కింద రైతుల వద్ద నుండి తీసుకున్న భూములలో నష్టపరిహారంపై రైతులతో మాట్లాడారు. రైతుల అభీష్టం మేరకు అధికారులు మసలుకోవాలని, రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే ఆర్డీవో దృష్టికి తేవాలని సూచించారు. సమావేశంలో గురజాల డివిజన్‌లోని తహశీల్దార్లు, ఆర్‌డిఒ అద్దెయ్య, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఏర్పాట్ల పరిశీలన
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో త్వరలో నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్‌ ర్యాలీ ఏర్పాట్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలోని బాలుర వసతి గృహంలో అభ్యర్థులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలన్నారు. పరిశీలనలో ఆర్‌డిఒ ఎం.శేషిరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో అనిల్‌ కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
10న నులిపురుగుల నివారణ దినోత్సవం
ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినంలో భాగంగా ఈ ఏడాది రెండో విడత కార్యక్రమాన్ని 10వ తేదీన నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ చెప్పారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను కలెక్టరేట్‌లో జెసి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం జెసి మాట్లాడుతూ 1-19 ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నూరుశాతం పూర్తి చేయాలని చెప్పారు. 1-19 ఏళ్ల వారు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 4,15,968 మంది ఉన్నారని చెప్పారు. 10వ తేదీన ఎవరైనా మిస్‌ అయితే 17వ తేదీన వేయాలని అన్నారు. వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని, ఎవరూ భయపడొద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ శోభారాణి, డిప్యూటీ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి కె.శామ్యూల్‌, ఐసిడిఎస్‌ పీడీ అరుణ, పాల్గొన్నారు.