ప్రజాశక్తి-ఈపూరు : రైతులంతా భూసార పరీక్షల చేయించుకుని ఆ ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని రైతులకు జిల్లా వనరుల కేంద్రం ఎడిఎ బివి శివకుమారి సూచించారు. పంటల సాగుపై మండల కేంద్రమైన ఈపూరు రైతు భరోసా కేంద్రంలో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. శివకుమారి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట, జీలుగా, జనుము, పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సాగు చేస్తే భూసారం పెరుగుతుందని చెప్పారు. విత్తన శుద్ధి ప్రక్రియ ద్వారా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చన్నారు. వరి పండించే రైతులు విత్తనాలను సూడోమోనాస్ 10 గ్రాములు కిలో విత్తనానికి లేదా కార్బ న్డిజం 2.5 గ్రాములు కిలో విత్తనానికి వాడాలని సూచిం చారు. మిరప పండించే రైతులు దుక్కిలో రెండు క్వింటాళ్ల వేప పిండి లేదా జీవ శిలీంద్ర నాసిని అయిన ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను వాడాలన్నారు. బాపట్ల వరి పరిశోధన కేంద్రంలో బిపిటి 2782 వరి కొత్త రకం అందుబాటులో ఉందని ఈ రకం పంటకాలం 145-150 రోజులని బ్యాక్టీరియ, ఎండు తెగులును, అగ్గి తెగులును తట్టుకుం టుందని వివరించారు. పప్పు జాతి పంటలైన పెసర రకాలు ఎల్‌జిజి 630, ఎల్‌జిజి 574 లాంఫారంలో అందు బాటులో ఉన్నాయన్నారు. రైతులకు పంట యాజమాన్యం పట్ల సందేహాలు ఉంటే రైతు సమాచార కేంద్రం - 155251ను సంప్రదించాలన్నారు. మండల వ్యవసాయ అధికారి రామారావు మాట్లాడుతూ కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందాలని, పొలం గట్లపై నాటేందుకు కందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని తెలిపారు. అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అప్పారావు, వ్యవసాయ సహాయకులు ఎం.శేషుబాబు పాల్గొన్నారు.










