ప్రజాశక్తి-పర్చూరు : రైతులు పండించిన పంటలలోని పనికి రాని చెత్తా చెదారాన్ని గతంలో పొలంలోనే ఓ చోట కుప్ప చేసి నిప్పు పెట్టే వారు. లేదంటే అమ్మేవారు. ప్రస్తుతం మూల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టారు. లోగడ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు చెప్పినా పట్టించుకోకుండా పంట వ్యర్ధాలను చేలల్లో లేకుండా చేసేవారు. ప్రస్తుతం ఆధునిక యంత్రాల వల్ల శనగ సాగు చేసిన రైతులంతా పంటలోని వ్యర్ధాలను చేలోనే ఉంచాల్సి వచ్చింది. గతంలో శనగ పంట నూర్పిడి చేసిన తర్వాత పొట్టు నామమాత్రపు రేటుకు అమ్ముకునే వారు. ప్రస్తుతం వచ్చిన ఆధునిక యంత్రాల ద్వారా నూర్పిడి చేయటం వల్ల పొట్టు వచ్చే అవకాశం లేదు. ఖర్చు తగ్గుతుంది. పంట వ్యర్ధాలు చేలోనే ఉండటం వల్ల దున్నితే భూమిలో కలిసిపోయి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. మిరప, వైట్ బర్లి పొగాకు, పత్తి తదితర పంటల వ్యర్ధాలను లోగడ కట్టె పుల్లలుగా ఉపయోగించుకునే వారు. వీటిని పంట చేతికి వచ్చిన అనంతరం సేంద్రీయ ఎరువుగా ఉప యోగించుకునే విధానం అవలంబిస్తున్నారు. మిరప, పత్తి, పొగాకు పైర్లను సైతం రొటేవేటర్ ద్వారా పొలంలోనే దున్నేస్తున్నారు. దున్నిన కొద్ది వ్యవధిలోనే కొంగలు అక్కడకు చేరుతున్నాయి. భూమిలో వచ్చిన క్రిమి కీటకాలను ఏరుకొని తింటున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో పురుగుల సమస్య తగ్గటమే కాకుండా పంటలో వ్యర్ధాలు నేల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం వస్తుంది. మొక్కజొన్న సైతం ఎక్కువ మంది రైతాంగం పంట చేతికి అందిన అనంతరం చేలోనే దున్నేందుకు ప్రయత్నిస్తున్నారు. లోగడ పంటలో వచ్చే చెత్తా చెదారాన్ని తగులబెట్టే వారు. దీనివల్ల పొగ కాలుష్య సమస్య ఏర్పడేది. రైతులు పంట వ్యర్ధాలను ఉపయోగించే విధానంలో అనుసరిస్తున్న మార్పులతో వాతావరణ కాలుష్య సమస్యను నేల ఆరోగ్యాన్ని పెంపొందించు కునేందుకు ఇది ఉపయోగపడుతుంది.










