Oct 27,2023 00:15

ప్రజాశక్తి - పంగులూరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు, నీటి పరీక్షల కేంద్రాన్ని రోటరీ మాజీ గవర్నర్ తేళ్ల రాజశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పిటిసి బాచిన చెంచు ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్న గ్రామమైన పంగులూరులో రోటరీ సేవలు విస్తారంగా జరుగుతున్నాయని అన్నారు. అందుకు రోటరీ క్లబ్ సభ్యులతో పాటు గ్రామస్తులు, పెద్దల సహకారం ఎంతో ఉందని చెప్పారు. భూసార పరీక్షలు, నీటి పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రోటరీ మాజీ అధ్యక్షుడు పెంట్యాల జగదీశ్వరరావు ఆర్థిక సహకారం అందించడం, కుటుంబ సభ్యులు సహకరించటం ఎంతో అభినందనీయమన్నారు. మాజీ జెడ్పిటిసి బాచిన చెంచు ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో భూసార పరీక్షలు కీలకమైనవని అన్నారు. అలాంటి  పరీక్షల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం వలన ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగమని అన్నారు. పేదలకు అనేక రకాలుగా సేవలు అందించడంతోపాటు రైతాంగానికి కూడా ఉపయోగపడే పనులు చేయడం పట్ల క్లబ్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో రొటీరియన్‌లు అన్నే రత్న ప్రభాకర్, శివన్నారాయణ, కొల్లా సింగారావు, అసిస్టెంట్ గవర్నర్ ఇంటూరి ఆంజనేయులు, రోటరీ మాజీ అధ్యక్షులు పెండ్యాల జగదీశ్వరరావు, నాగాలాండ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బత్తుల వీరనారాయణ, గుర్రం ఆంజనేయులు, చిలుకూరి వీరరాఘవయ్య, ఇమ్మడిశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు.