Oct 08,2023 21:40

చెట్టుకు ఉరివేసుకున్న వెంకటేష్‌

ప్రజాశక్తి-హిందూపురం, లేపాక్షి : పేద దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములు పెద్దల పరమవుతున్నాయి. తమ భూములను అక్రమంగా చేజిక్కించుకున్న కుశలవ కంపెనీ యాజమాన్యంపై లేపాక్షి మండలం కొండూరు రైతులు సాగిస్తున్న భూ పోరాటంలో రైతులు సమిధలు అవుతున్నారు. పెద్దలతో పోరాటంపై ఆందోళన చెందుతున్న నిరుపేద రైతులు తమ భూములు దక్కుతాయో లేదో అన్న దిగులుతో ప్రాణాలు వదులుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్నా వందల ఎకరాల భూములను కంపెనీ పేరిట 1బి ఖాతా సృష్టించిన రెవిన్యూ అధికారులు కుట్రలు, కుతంత్రలతో వారి పరం చేస్తుడడంతో పాటు రాత్రికి రాత్రే రికార్డులను సైతం మారుస్తుడడంతో పేద రైతుల్లో భయం అలుముకుంది. దీంతో బలవన్మరణాలకు దిగుతున్నారు. ఇలాంటి దయనీయమైన సంఘటన ఆదివారం శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరు సమీపంలో చోటుచేసుకుంది.
లేపాక్షి మండలంలోని కుశలవ భూముల విషయంలో దిగులు చెంది రెండు నెలల క్రితం తిప్పన్న చనిపోతే అతని కుమారుడు వెంకటేష్‌ (35) ఆదివారం వారికి కేటాయించిన భూముల్లో చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే భూ బాధితులు వారికి కేటాయించిన భూముల కోసం పోరాటం చేస్తు భూములు తమకు దక్కుతాయో లేదో అన్న దిగులుతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని దళిత రైతులతో పాటు సిపిఎం, కెవిపిఎస్‌ నాయకులు వాపోతున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామ పంచాయతీ పొలంలో దాదాపు వందల ఎకరాల ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా కుశలవ యాజమాన్యం పేరిట ఖాతా నెంబర్‌ 14 65 లో వన్‌ బి మంజూరు చేసుకున్నారు. భూమిని చదును చేస్తామని లీజుకు ఇవ్వండని నమ్మబలికి ఏకంగా బడుగు బలహీన వర్గాల దళిత ఎస్సీ, ఎస్టీ భూములను కొట్టేసే ప్రయత్నం చేశారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు పత్రాలను సృష్టించి తమ భూములు దక్కించుకోవాలని కుట్ర పన్నిన కుశలవ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా కొర్లకుంట గ్రామ నివాసి కుశలవ భూ బాధితుడు, దళిత యువరైతు కుశలవ ఆక్రమణలో ఉన్న తన సొంత పొలంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన యువరైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం, కెవిపిఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. కుశలవ కంపెనీ అక్రమాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి అసైన్డ్‌ చట్టం ప్రకారం నాడు ప్రభుత్వం ఎవరికి భూములను కేటాయించిందో వారికి ఇవ్వాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతు ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే లేపాక్షి తహశీల్దార్‌ కె.బాబు, రూరల్‌ సిఐ వేణుగోపాల్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.