ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : భూ పంపిణీని ప్రభుత్వం ఒక విధానంగా చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన భూ సదస్సు డిమాండ్ చేసింది. నియోజకవర్గ కేంద్రమైన గురజాలలో టి.శ్రీను అధ్యక్షత భూ సదస్సును గురువారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో పేదలకు భూ పంపిణీ చేయడానికి వేలాది ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. చర్లగుడిపాడులోని దళితులకు చెందిన 300 ఎకరాల ప్రభుత్వ భూములను ఆ గ్రామంలోని దళితులకు పట్టాలిచ్చి పంపిణీ చేయాలన్నారు. అన్యాక్రాంతమైన అసైన్మెంట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పేదలకు పంపిణీ చేయాలని, అటవీ సరిహద్దుల్లో ఉన్న అన్ సర్వే భూములను సర్వే చేసి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. సిమెంట్ ఫ్యాక్టరీలు కడతామని చెప్పి రైతుల వద్ద తీసుకున్న భూములను ఫ్యాక్టరీలు కట్టలేదదని, వాటిని రైతులకు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. గురజాల నియోజకవర్గంలోని దేవాలయ భూములు భూమిలేని పేదలకు నామ మాత్రపు కౌలుకు ఇవ్వాలని, కౌలు ప్రభుత్వం చెల్లించాలని కోరారు. పేదల స్వాధీనంలో ఉన్న పోరంబోకు, బంజరు భూములకు రెవెన్యూ రికార్డుల పరంగా హక్కులు కల్పించాలని, భూసీలింగ్ చట్టం ప్రకారం పునర్విచారణ చేపట్టి భూ పంపిణికి అదనపు భూములు రాబట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్న, వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల ప్రకారం భూమిలేని ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి రెండు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని కోరారు. అనంతరం ఎంపిడిఒ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ చర్లగుడిపాడులోని 300 ఎకరాలు నానమ్మ చెరువుకు చెందిన ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని కోరుతూ 6 నెలలుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నామని, ఇంతవరకు ఈ భూములు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేటాయించారా? కేటాయించలేదా? అధికారులు చెప్పలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్లగుడిపాడు దళితులు చెప్పినట్లు ఈ భూమి విద్యాలయానికి కేటాయించలేదు కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వెంటనే ఆ గ్రామ దళితులకు పంపిణీ చేయాలన్నారు. 15 రోజుల్లోగా విశ్వవిద్యాలయానికి భూమి కేటాయించినట్లు రుజువు చేయలేకపోతే భూ పంపిణీ కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రకటించారు. కార్యక్రమంలో పి.ఆదాం, కె.అక్కులు, బి.సువర్ణబాబు, కె.యలమంద, పి.మరియదాసు, పి.బంగారమ్మ, పి.దానమ్మ, పి.వజ్రం, పి.చినబాబు, పి.రాణమ్మ, పి.రమేష్, వి.ఏసుబాబు, కోటేశ్వరరావు, వ్యవసాయ కూలీలు, చర్లగుడిపాడు దళితులు పాల్గొన్నారు.










