Dec 03,2022 22:18

భూస్వాముల కబంధ హస్తాల్లో ఎర్రకాల్వ మిగులు భూములు
ఏజెన్సీలో ఎల్‌టిఆర్‌, పోడు భూముల పరిస్థితీ అంతే
పేదలు రోడ్డెక్కినా పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన నిరంతర పోరు
ప్రజాశక్తి - పశ్చిమ డెస్క్‌

మాకు సెంటు భూమి లేదు.. ప్రభుత్వ భూమి లేదా మిగులు భూమి ఇస్తే సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాం అని పేదలు ఏ ప్రజాప్రతినిధినైనా, అధికారినైనా కోరితే భూములు ఎక్కడున్నాయనే ప్రశ్న ఠక్కున అర్జీదారులపై సంధిస్తారు. అయితే బడాబాబులు, భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్న భూముల జోలికి మాత్రం వెళ్లరు. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉంటే అక్కడ సాగు చేసుకునేందుకు పేదలు ఉపక్రమిస్తే ఆగమేఘాల మీద అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని వాలిపోతారు. పేదలు అనే కనికరం లేకుండా విరుచుకుపడి వారిని అక్కడి నుంచి తరిమికొడతారు. ఇదేమిటని ప్రశ్నిస్తే లాఠీదెబ్బలు, అరెస్టులు, కేసులు షరామాములే. ఇదీ జిల్లాలో భూమిలేని సగటు పేదవాని దుస్థితి
అయితే ప్రభుత్వ, మిగులు భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని పేదలకు పంచాలని జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం నిర్విరామ పోరు సాగిస్తోంది. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం ప్రాంతాల్లోని ఎర్రకాల్వ మిగులు భూములను పేదలకు పంచాలని అప్రతిహతంగా సంఘం ఆధ్వర్యాన ఆయా ప్రాంతాల పేదలు పోరాడుతున్నారు. ఏజెన్సీలో ఎల్‌టిఆర్‌, పోడు భూములను గిరిజనులకు పంచాలని అక్కడి గిరిజన సంఘంతో కలిసి పేద యువత, మహిళలను సమీకరించి పోరుబాటలో ముందుకు సాగుతున్నారు. ఎర్రకాల్వ రిజర్వాయర్‌ మిగులు భూములు పేదలకు సాగుకివ్వాలని, జిల్లాలో 16 రకాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని, సాగులో ఉన్న భూములు, గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలివ్వాలని, ఏజెన్సీలో ఎల్‌టిఆర్‌ భూములు గిరిజనులకు పంచాలని, పోడు, అటవీ బంజరు భూములకు పట్టాలివ్వాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేస్తోంది. జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం మండలాల్లో 1980లో నిర్మించిన ఎర్రకాల్వ రిజర్వాయర్‌ కోసం ఏడు వేల ఎకరాలు సేకరించారు. నాటి నుండి సుమారు 2500 ఎకరాలు ముంపులో లేకుండా మిగులు భూములుగా ఉన్నాయి. దీంతో ఆ భూములను అమ్మిన భూస్వాములు, సంపన్నులే నాటి నుండి అక్రమంగా, చట్టవిరుద్ధంగా వాటిని అనుభవిస్తున్నారు. భూములకు పరిహారం పొంది, వాటితో మరోచోట భూములు కొని అనుభవిస్తున్నారు. ఈ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా పామాయిల్‌, జామాయిల్‌, కొబ్బరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తున్నారు. దీనివల్ల గట్టు బలహీనపడుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా వీరికి విద్యుత్‌ శాఖ బోరు కనెక్షన్లు సైతం ఇచ్చింది. 40 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు, నేతలు మారినా యథేచ్ఛగా పైసా శిస్తు చెల్లించకుండా ఆ భూములను పెద్దలు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ భూములన్నీ పేదలకు సాగుకు ఇవ్వాలని భూముల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు, అధికారులకు చట్టాలు, నిబంధనలు గుర్తొస్తాయి. గత నాలుగు సంవత్సరాల నుంచి ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన సాగిస్తున్న పోరాటం పేదల్లో ఆశలు చిగురింపజేసింది. కులం, మతం, ప్రాంతం, పార్టీ విభేదాలన్నింటినీ పక్కనబెట్టి పేదలంతా ఒక్కటయ్యారు. పట్టుదలగా పోరాటం సాగిస్తున్నారు. వందలాది ఎకరాల్లో వరి సాగు వేసి ధాన్యం పంచుకుంటున్నారు. పామాయిల్‌, కొబ్బరి తోటల్లో ఫలసాయం పొందుతున్నారు. దీన్ని సహించలేని భూస్వాములు, సంపన్నులు నాటి, ప్రస్తుత అధికార పార్టీల నేతలు కుమ్మక్కై అధికారుల సహకారంతో నిర్భందానికి పాల్పడుతున్నారు. పదికి పైగా కేసులు మోపారు. పేదలపై తుపాకులు ఎక్కుపెట్టి బెదిరించారు. గూండాలతో దాడులకు పూనుకున్నారు. పేదలకు అండగా నిల్చిన టి.నర్సాపురం మండల నాయకుడు తుమ్మల సత్యనారాయణను కిడ్నాప్‌ చేసి, చంపేస్తామని బెదిరించడం భూస్వాముల ఆగడాలకు పరాకాష్టగా చెప్పొచ్చు. వీటన్నింటినీ తిప్పికొట్టి పేదలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇరిగేషన్‌ రాష్ట్ర స్థాయి అధికారులపై ఒత్తిడి చేసి భూస్వాములే భూములు సాగు చేసుకునేలా, శిస్తు కట్టించుకునేలా అనుమతులు తీసుకురావడం గమనార్హం. అయినప్పటికీ పేదలు పట్టు వీడకుండా పోరాడుతున్నారు. మరోపక్క కోర్టుల్లోనూ న్యాయపోరాటం సాగిస్తున్నారు.
జిల్లాలో అన్ని భూముల సంగతీ అంతే
జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో 80 ఎకరాల సీలింగ్‌ భూములు, టి.నర్సాపురం మండలం రామన్నగూడేనికి చెందిన 40 ఎకరాలు, కృష్ణాపురం మెట్టపై అల్లూరి సీతారామరాజునగర్‌లో గుడిసెలు వేసుకున్న 80 ఎకరాల దేవుని మాన్యం భూముల విషయంలో జరుగుతున్నది ఇదే. అల్లంచర్లరాజుగూడెంలో 300 ఎకరాల అసైన్డ్‌ భూముల విషయమై ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్థానిక పెత్తందారులు కొత్త వివాదాలు తీసుకొస్తున్నారు. లింగపాలెం మండలం భోగోలులో 1400 ఎకరాలు అసైన్డ్‌ భూములు దశాబ్ధాలు గడిచినా పేదలకు దక్కడం లేదు. చింతలపూడి పాత తాలుకాలో 30 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు సంపన్నుల ఆక్రమణలోనే ఉన్నాయి. జిల్లాలో 16 రకాల ప్రభుత్వ భూములు 5.75 లక్షల ఎకరాల్లో నాలుగు లక్షల ఎకరాలకుపైగా సంపన్నుల గుప్పెట్లో ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలంలో జిల్లా పరిషత్‌ భూములు, దెందులూరు మండలం కొవ్వలి, దోసపాడు, పోతునూరు గ్రామాల్లో అసైన్డ్‌ భూములు వందల ఎకరాలు భూమాఫియా చేతుల్లో ఉన్నాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఒకే ఇంట్లో మూడు, నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది.
భూములు పంచాలని పోరు ఉధృతం
ఎం.జీవరత్నం,
ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
భూముల సమస్యపై ఎపి వ్యవసాయ కార్మిక సంఘం భూశంఖారావం పేరిట చేపట్టిన పాదయాత్ర పేదల్లో ఉత్సాహన్ని, స్ఫూర్తిని నింపింది. అధికారులు సైతం ఒకింత అప్రమత్తమయ్యారు. అయితే అధికార పార్టీ పెద్దలు, పెత్తందారుల ఒత్తిడిలో వారు కూడా బడాబాబుల పక్షానే నిలుస్తుండటం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ, మిగులు భూములను పేదలకు పంచితే కొన్ని వేల కుటుంబాల జీవనం మెరుగుపడుతుంది. పేదలకు భూములు పంచాలని పోరు రానున్న కాలంలో మరింత ఉధృతం చేస్తాం.