Sep 19,2023 22:18

ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గొర్రెలు కాపర్లు

ప్రజాశక్తి- బొబ్బిలి :  జీవనోపాధి కల్పిస్తున్న భూములను లాక్కుని తమ బతుకులను రోడ్డు పాలు చేయవద్దని గొర్రెల కాపర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తిరాజేరు మండలం చినచామాలపల్లి గ్రామంలో 50 ఎకరాల భూమి సేకరణను విరమించుకోవాలని కోరుతూ మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద గొర్రెల కాపర్లు మంగళవారం ధర్నా చేశారు. గ్రామానికి ఆనుకుని ఉన్న భూములను కొంతమంది బడా వ్యాపారులు కొనుగోలు చేయడంతో ఆయా భూములు చుట్టూ కంచె ఏర్పాటు చేయడం వల్ల గొర్రెలను మేతకు తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న భూములను తీసుకుంటే గొర్రెలను మేతకు తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ 150 కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న భూములను తీసుకుని కృషి భవన్‌కు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఎఒ గణపతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎం.ఎరుకునాయుడు, సర్పంచ్‌ మజ్జి భారతి, జిల్లా కమిటీ సభ్యులు జి. శ్రీనివాసరావు, వైసిపి నాయకులు మజ్జి శ్రీనివాసరావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.