Jul 11,2023 00:22

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న పేద, దళిత రైతులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : కొమ్మాది, బక్కన్నపాలెం, రేవళ్ళపాలెం గ్రామాల్లో భూములు కోల్పొయిన పేదలందరికీ ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, డి.అప్పలరాజు మాట్లాడుతూ, జివిఎంసి 6వ వార్డు పరిధి కొమ్మాది, బక్కన్నపాలెం, రేవళ్ళపాలెం గ్రామాల్లోని పేద, దళిత రైతులకు 1978లో ఇందిరా గాంధీ ప్రభుత్వం కుటుంబానికి ఎకరం చొప్పున 80 కుటుంబాలకు వ్యవసాయ భూములు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు తెలియకుండానే వారి భూములను నవోదయ స్కూలు, వికలాంగుల ఐటిఐ, పట్టుపురుగుల పరిశ్రమ, పోలీస్‌ శిక్షణా కేంద్రం వంటి నిర్మాణాలకు తీసుకుందన్నారు. ఈ మధ్య కాలంలో జూనియర్‌ కాలేజీ నిర్మాణం చేపట్టినప్పుడు ఆ గ్రామాల రైతులందరూ ఆ ప్రాంతానికి చేరుకొని తమ భూములకు ప్రత్యామ్నాయం చూపాలని ఆందోళన చేశారని తెలిపారు. అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, భూములకు ప్రత్యామ్నాయంగా హూదూద్‌ సందర్భంగా ఇళ్ళు కొల్పోయిన వారికి ''సినిమా ఇండ్రస్టీ''వారు నిర్మిస్తున్న ఇళ్ళల్లో వారికి కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇంతవరకు హామీ నెరవేరలేదన్నారు. బాధితులందరూ హైకోర్టు ఆశ్రయించగా, వీరందరికీ ఇళ్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయలేదన్నారు. గత సంవత్సరం హౌసింగ్‌ పీడీ ఆఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలపగా వారంలో రోజుల్లో విచారణ జరిపి ఇళ్లు కేటాయిస్తామని హౌసింగ్‌ అధికారులు హామీ ఇచ్చి ఏడాది గడిచినా, ఇంతవరకూ కేటాయించలేదన్నారు. రెవెన్యూ అధికారులు ఆ గ్రామాల్లో పర్యటించి బాధితుల జాబితాను తయారుచేసినా ఇంతవరకు ఇళ్ళు కేటాయించకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ మేరకు స్పందనలో కలెక్టర్‌ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సియ్యాద్రి పైడితల్లి, అప్పలరాజు, వెంకయ్యమ్మ, బంగారమ్మ, నరసయమ్మ, దేవుడు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.