
ముప్పాళ్ల: కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి 167 ఏజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న మాదల, ఇరుకుపాలెం గ్రామాలకు చెందిన రైతులకు మండల తహశీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో అవార్డు ఎంక్వయిరీ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రైతుల నుంచి భూములకు సంబంధించిన డాక్యు మెంట్లను, ఇతరత్రా ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ స్టాంప్ డ్యూటికి రెండున్నర రెట్లు పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా రైతుల నుండి అవార్డ్ ఎంక్వెయిరీ అర్జీలు తీసుకున్నారు. అదేవిధంగా రైతుల నుండి వచ్చిన వినతులను, అభ్యంతరాలను కూడా స్వీకరించి న్యాయం చేస్తా మని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రాజకుమారి, తహశీల్దార్ భవానీశంకర్,డిటి లక్ష్మీ ప్రసాద్ పాల్గొన్నారు.
నష్టపరిహారం పెంచి రైతులకు న్యాయం చేయండి
తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులతో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్, సత్తెనపల్లి ఆర్డీవో, ముప్పాళ్ళ తహశీల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులకు అవార్డు ప్రకటన చేశారు. రోడ్డుకు లోపల ఉన్న పొలాలకు 7,22,000 అని రోడ్డుకు ఆనుకుని ఉన్న పొలాలకు 8,50,000 వేల అని నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు ఈ అవార్డు తమకు అంగీకారం కాదని, న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని, నష్టపరిహారం కోసం ప్రతిపాదించిన భూమి రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని, దీనివల్ల తాము పూర్తిగా నష్టపోతామని, రైతులతో సంప్రదించి వాస్తవమైన రేటు నిర్ణయం చేయాలని రైతుల కోరారు. సమావేశంలో రైతు సంఘం ప్రతినిధులు గుంటుపల్లి బాలకృష్ణ పెండ్యాల మహేష్, గోరంట్ల విష్ణువర్ధన్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రతిపాదించిన నష్టపరిహారం వల్ల త్రీవ్ర అన్యాయం జరుగుతుందని, మార్కెట్ రేటు నిర్ణయం చేసేటప్పుడు మార్కెట్ రేటు రెట్టింపు చేసి దానికి 100 శాతం కారుణ్య పరిహారం కలిపి నష్టపరిహారం చెల్లించాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతు జీవన పరిస్థితి భూసేకరణకు ముందు కంటే భూసేకరణ తర్వాత మెరుగ్గా ఉండేలా నష్టపరిహారం నిర్ణయించాలన్నారు. నష్టపరిహారం మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు ఉండలా నిర్ణయించాలని కోరారు రైతులతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారి భూముల్లో రాళ్లు పాతడం చాలా దుర్మార్గమని అన్నారు. రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాడుతుందని రైతుల సందేహాలు నివృతి చేసుకునేందుకు సత్తెనపల్లి పట్టణంలోని పుతుంభాక వెంకటపతి భవన్ లో సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో మార్పుల వెంకటరెడ్డి,గారా జాలయ్య, కామేశ్వరరావు కొల్లా వెంకటేశ్వర్లు ఎర్రగుంట్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.