ప్రజాశక్తి-గొలుగొండ:వైసిపి ప్రభుత్వం డ్రోన్ సర్వే ద్వారా ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుని వాటిని దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. బుధవారం గొలుగొండ మండలం కొత్తజోగుంపేట గ్రామంలో గొలుగొండ మండలం తెలుగు యువత ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ల వెనక్కి పోయిందన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న తనయుడు చింతకాయల రాజేష్, గొలుగొండ మండల టీడీపీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు కర్రీ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టిడ్కో లబ్ధిదారులకు రుణమాఫీ ఏదీ?
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న
ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు లబ్ధిదారులు కట్టవలసిన బ్యాంక్ రుణాన్ని మాఫీ చేస్తామన్న సిఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. సిఎం జగన్మోహన్‌రెెడ్డి 2019 ఎన్నికల సమయంలో నర్సీపట్నం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్ల బ్యాంక్ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఇంత వరకు నెర వేర్చలేదన్నారు. అధికారంలోకి వస్తే రుణాన్ని కట్టవద్దని చెబితే ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మోసం చేశారన్నారు. టిడ్కో ఇళ్లలో ఎటువంటి సదుపాయాలు లేవని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం టిడ్కో ఇళ్ల బ్యాంక్ రుణాలు మాఫీ చేయాలన్నారు. ఇల్లు అప్పగిచక పోయినా రుణాలు కట్టడానికి లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాము ఈ సమస్యపై అడిగితే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారన్నారు. దీనిపై నర్సీపట్నం వస్తున్న సీఎంను టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు గట్టిగా ప్రశ్నించాలని సూచించారు.










